మహబూబ్‌నగర్ జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం జడ్చర్ల. ఎంత వేగంగా ప్రగతి సాధించిందో అంతే వేగంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చి పడ్డాయి. పట్టణంలో జనాభా పెరుగుదలతో పాటే రహదారులపై రద్దీ పెరగడంతో సమస్య మరింత జటిలం అయింది. ఒకవైపు పోలీసు సిబ్బందిపై ఒత్తిడి పెరగడంతో రాత్రివేళ పెట్రోలింగ్ చర్యలు తగ్గడం ప్రమాదాలకు కారణమవుతోంది.
జడ్చర్లలో ట్రాఫిక్ జటిలం...ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
ఒకవైపు జాతీయ రహదారులు నెత్తురోడుతుండగా మేమేం తక్కువ కాదంటూ పట్టణాల్లో రోడ్లు పోటీపడుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న జడ్చర్ల ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. పోలీసు సిబ్బందిపై పని ఒత్తిడి సమస్య వాస్తవమే అయినా రాత్రివేళల్లో పెట్రోలింగ్ చర్యలు పెద్దగా చేపట్టకపోవడం ఇందుకు కారణం. గత ఆరు నెలల కాలంలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే ప్రత్యక్ష నిదర్శనం.
మరోవైపు పట్టణంలో భవన యజమానులు ఇరువైపులా రోడ్లను ఆక్రమించడం, చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు లేకపోవడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఆరు నెలలుగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన అమాయకుల ప్రాణాలే ఇందుకు నిదర్శనం. జడ్చర్ల పరిధిలో దాదాపు 40 మందికిపైగా సిబ్బంది ఉన్నా సీసీ కెమెరాలపై పర్యవేక్షణ కొరవడింది. నేతాజీ చౌక్‌లో లారీ అతివేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఇలాంటి ప్రమాదాలు ఒక ఉదాహరణ మాత్రమే.
ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడ ప్రమాదాలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. సిబ్బంది కొరత వల్ల మాపై ఒత్తిడి పెరుగుతోంది. ట్రాఫిక్ నియంత్రణకు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరామని... త్వరలో ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జడ్చర్ల సీఐ వీరస్వామి తెలిపారు.