తెలంగాణ

telangana

ETV Bharat / state

పొత్తుల దిశగా అడుగులు.. ఏపీలో మారుతున్న రాజకీయాలు

Alliance between TDP and Janasena: ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు పొడవనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మధ్య గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన తొలి భేటీ, తాజాగా హైదరాబాద్‌లో సమావేశం.. వీరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తోందనేది రాజకీయ వర్గాల మాట. అయితే ఇరుపార్టీల మధ్య బీజేపీ పాత్ర ఏంటనే సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుత పరిణామాలు టీడీపీ, జనసేన మధ్య ఉన్న బంధాన్ని మరింత దగ్గర చేసి.. ఎన్ని అడ్డంకులు వచ్చినా కలిసి నడవాలనే దిశగానే పయనిస్తోంది.

Alliance between TDP and Janasena
Alliance between TDP and Janasena

By

Published : Jan 9, 2023, 8:39 AM IST

పొత్తుల దిశగా అడుగులు.. ఏపీలో మారుతున్న రాజకీయాలు

Alliance between TDP and Janasena: ఆంధ్రప్రదేశ్​లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై సందేహాలు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి. రెండు నెలల క్రితం ప్రధాని మోదీతో పవన్‌ కల్యాణ్‌ భేటీ తర్వాత సందేహాలు తలెత్తినా, తాజాగా హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇరు పార్టీల అధినేతల కలయిక.. పొత్తుపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇరువురు నేతల తాజా భేటీకి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 సందర్భం అయినప్పటికీ భవిష్యత్తు బంధం బలోపేతం దిశగా ఇరుపార్టీలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

పరస్పర అవగాహన కుదుర్చుకునే దిశగా ఇద్దరు నేతల మధ్య మరిన్ని సమావేశాలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం దృష్ట్యా, ఇరు పార్టీలు సంయుక్తంగా చేపట్టే కార్యక్రమాలు.. మరింత వేగం పుంజుకోనున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కలిసి పనిచేయడమనే అంశంపైనే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల మధ్య ప్రధానంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఇప్పటికే కిందిస్థాయిలో కలిసి పనిచేస్తున్నారని, పొత్తుపై సానుకూల ధోరణి నెలకొన్నందున ఇరుపార్టీల నేతలు ఒక అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

ఓట్లు చీలకుండా: వైసీపీ అరాచకాల్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ కలవాలని పిలుపునిస్తున్న చంద్రబాబు.. రాజకీయ పార్టీలకు వ్యూహాలు ఉంటాయని, పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెబుతూవస్తున్నారు. వైసీపీ అకృత్యాలను అడ్డుకునేందుకు వెనకాడబోమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననని పవన్‌ కల్యాణ్‌ పదేపదే పునరుద్ఘాటిస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వకపోవడం, సమయానుకూలంగా నిర్ణయమంటే.. పొత్తు మినహా మరే మార్గమూ లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అందుకు అనుగుణంగానే.. భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని నిన్నటి భేటీ తర్వాత ఇరుపార్టీల నేతలూ ప్రకటించారు. రాజకీయాల్లో పొత్తులు సహజమన్న చంద్రబాబు, వాటిపై తర్వాత చర్చిస్తామని చెప్పారు. వైసీపీను ఎలా ఎదుర్కోవాలనే విషయమై భీజేపీ నేతలతోనూ మాట్లాడతానని పవన్‌ కల్యాణ్‌ చెప్పడంతో భవిష్యత్తులో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమనే ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. వైసీపీను సంయుక్తంగా, బలంగా ఎదుర్కొంటామని కూడా పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

అరాచక పాలనకు వ్యతిరేకంగా: వైసీపీ సాగిస్తున్న అరాచకపాలన, పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహరిస్తున్న అణచివేత చర్యలపై ఉమ్మడి పోరాటం దిశగానే రెండు పార్టీలు అడుగులు వేస్తున్నాయి. విశాఖ పర్యటనలో పవన్‌ కల్యాణ్‌పైన, కుప్పం పర్యటన సమయంలో చంద్రబాబుపైన ప్రభుత్వ ఆంక్షల దృష్ట్యా ఇరువురు నేతలు ఒకరినొకరు కలిసి సంఘీభావం తెలిపారు. మొత్తంగా ఇరుపార్టీల అధినేతలు ఈ మధ్య కాలంలో రెండు దఫాలుగా ఆంతరంగికంగా భేటీ అయ్యారు. ప్రతిపక్షాలను సంఘటితం చేసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని చెప్పారు.

తాజా సమావేశంలోనూ.. భవిష్యత్తులో కలిసి పనిచేయబోతున్నామని స్పష్టం చేశారు. తమ కలయిక సంఘీభావానికే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నామనే సంకేతాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై పోరాటంలో కలసి నడవాలని తెలుగుదేశం, జనసేన అధినేతలు ఇది వరకే నిర్ణయించుకున్నారు. దాన్ని మరింత పటిష్ఠం చేసి, ఉమ్మడి కార్యాచరణతో పోరాటం చేయాలని హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఓ అభిప్రాయానికి వచ్చారు. వైసీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు, ప్రజా సంఘాలను కూడా ఏకతాటిపైకి తెచ్చి పోరాటం ఉద్ధృతం చేయాలని చంద్రబాబు, పవన్‌ నిర్ణయించారు. ఎన్నికల వరకు వివిధ సమస్యలపై కలిసి పోరాడేలా కార్యాచరణ రూపొందించడంపైనే చర్చించినట్లు సన్నిహితులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details