తెలంగాణ

telangana

Harish rao: 'గతంలో 20 ఏళ్లకో కొత్త వైద్య కళాశాల.. ఈ 8 ఏళ్లలోనే 20 ఏర్పాటు'

By

Published : Apr 16, 2023, 1:46 PM IST

Harishrao Inaugurated MNJ Cancer Hospital New Block: రూ.140 కోట్ల వ్యయంతో ఎంఎన్​జేకు అదనంగా కొత్త బ్లాక్‌ ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. గతంలో 20 ఏళ్లకోసారి కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు జరిగేదని.. ఈ 8 ఏళ్లల్లో 20 నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. హైదరాబాద్​లోని ఎంఎన్​జే ఆసుపత్రిలో నూతన బ్లాక్​ను.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డితో కలిసి హరీశ్​రావు ప్రారంభించారు.

Harishrao
Harishrao

Harishrao Inaugurated MNJ Cancer Hospital New Block: గతంలో 20 ఏళ్లకోసారి కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు జరిగేదని.. ఈ 8 ఏళ్లల్లో 20 నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పెరిగిన అవసరాల మేరకు ఆస్పత్రులను సీఎం కేసీఆర్‌ విస్తరిస్తున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్​లోని ఎంఎన్​జే ఆసుపత్రిలో నూతన బ్లాక్​ను.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డితో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు.

జిల్లా ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్‌ రోగులకు చికిత్స: రూ.140 కోట్ల వ్యయంతో ఎంఎన్​జేకు అదనంగా కొత్త బ్లాక్‌ ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్​రావు అన్నారు. క్యాన్సర్‌ చికిత్సల కోసం రూ.800 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి.. ఇకపై జిల్లా ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఆస్పత్రుల్లో డయాలిసిస్‌ సేవలు గతంలోనే ప్రారంభమయ్యాయన్న హరీశ్​రావు.. 8 జిల్లా ఆస్పత్రుల్లో త్వరలోనే కీమో థెరపీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.

'ఇన్ని దశాబ్దాలుగా మనకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులే దిక్కు. కొన్నేళ్లుగా నగరంలో కొత్త ఆస్పత్రుల నిర్మాణం జరగలేదు.పెరిగిన అవసరాల మేరకు ఆస్పత్రులను సీఎం విస్తరిస్తున్నారు. హైదరాబాద్‌ నాలుగు వైపులా 4 ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాది అందుబాటులోకి 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. గతంలో 20 ఏళ్లకోసారి కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు జరిగేది. ఈ 8 ఏళ్లల్లో కొత్తగా 20 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగాం. 900 ఎంబీబీఎస్ సీట్లను 7 వేలకు పైగా పెంచుకోగలిగాం. మన విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేస్తున్నాం.'-హరీశ్​రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

'రూ.140 కోట్ల వ్యయంతో ఎంఎన్‌జేకు అదనంగా కొత్త బ్లాక్‌ ఏర్పాటు చేశాం'

భారత్​లోనే రెండో అతిపెద్ద కాన్సర్ ఆసుపత్రి: ఎంఎన్​జేలో 300 పడకల బ్లాక్ ప్రారంభం సంతోషంగా ఉందని హరీశ్​రావు అన్నారు. రూ.80 కోట్లతో అరబిందో సంస్థ ఈ బ్లాక్​ను నిర్మించి ప్రభుత్వానికి అందించిందన్నారు. 8 అంతస్తుల ఎంఎన్​జే భవనం.. 100 శాతం బెడ్ ఆక్యుపెన్సీతో పని చేస్తోందని తెలిపారు. కొత్త బెడ్స్​తో కలిపి 750 పడకలకు ఎంఎన్​జే విస్తరించిందన్న హరీశ్​రావు... భారత్​లోనే ఇది రెండో అతిపెద్ద కాన్సర్ ఆసుపత్రి అని పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా 100 పడకలతో వింగ్ ఇందులో అందుబాటులో ఉందన్న ఆయన... చిన్నారుల కోసం 120 పడకలతో పీడియాట్రిక్ వింగ్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు.

'బోన్ మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్ అందుబాటులోకి తెచ్చాం. నిమ్స్​లో ప్రతి నెల 8 మందికి బోన్​ మ్యారో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. అరబిందో సహకారంతో 8 స్పెషలిటీ రూమ్​లు ఎంఎన్​జేలో అందుబాటులోకి వచ్చాయి. ఇకపై ఎంఎన్​జేలో నెలకు 12 మంది వరకు బోన్ మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్ చేసే అవకాశం ఉంది. రూ.140 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ భవనానికి అరబిందో రూ.80 కోట్లు, ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించింది.'-హరీశ్​రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details