Ex Minister Niranjan Reddy Comments on Congress :రైతుబంధుఅంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిహాసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. వరికి బోనస్ సంగతి దేవుడు ఎరుగనని, కొన్న ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వరి కొనుగోలు చేసిన వెయ్యి కోట్లను బోనస్‌తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు డబ్బులు వేయకుండానే వేశామని దబాయిస్తున్నారని ఆరోపించారు.
రైతు బంధు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కరు మాత్రమే నిజం చెప్పారని నిరంజన్‌రెడ్డి ఆయనను కొనియాడారు. కాంగ్రెస్(Congress) నాయకులు రుణమాఫీ చేస్తామని, అప్పు తెచ్చుకోండని రైతులకు ఎన్నికల సమయంలో భ్రమలు కల్పించారని ఆక్షేపించారు. రైతులను వంచిస్తున్నారని, వారి ఇచ్చిన హామీలు సాధ్యం కాదని తాము అనాడే చెప్పామని గుర్తు చేశారు. ఒక్క రైతుకు అయినా రుణమాఫీ చేసినట్లయితే ఆధారాలు చూపించండని మాజీ మంత్రి సవాల్ విసిరారు.
BRS Leader Niranjan Reddy on Agriculture :కాళేశ్వరం(kaleshwaram project) ద్వారా ఎత్తిపోసిన నీరు జలాశయాల్లో ఉన్నాయని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో గోదావరి బేసిన్లో యాసంగి సాగుకు నీరు ఇస్తారా లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాసంగి పంట చేతికి వచ్చేసరికి పంటలకు తగిన మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ సాకుగా చూపి మళ్లీ తప్పించుకోవద్దని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.