హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహేంద్ర.. హైదరాబాద్‌లో బాలికపై 'పలుకుబడి' ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. '' ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదు అని నా అభిప్రాయం. ఆ యువకులు 'పలుకుబడి' ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవత విలువలు లేని, సరైన పెంపకం తెలియని దిగువ స్థాయి కుటుంబాల వారు అనడం సరైంది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా...'' అని ట్వీట్ చేశారు.
అసలు ఇదీ జరిగిందీ...పబ్‌లో పరిచయమైన ఒక బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు. వీరిలో సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడిని శుక్రవారం రోజున పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఓ మైనర్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు సమాచారం. కర్ణాటకలో తల దాచుకున్న ఉమర్ఖాన్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ అరెస్టులపై స్పష్టత లేదు. పోలీసులు మాత్రం తాము ఇప్పటివరకు ముగ్గురునే అరెస్ట్ చేశామని చెబుతున్నారు.