తెలంగాణ

telangana

ETV Bharat / sports

పతక విజేతలకు కోట్లలో నజరానా- ట్యాక్స్​ కట్టాలా మరి?

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించాయి. వీటితో పాటు కొంతమంది ప్రముఖులూ నగదు బహుమానాలను ప్రకటించారు. ఈ విధంగా కోట్ల రూపాయలు క్రీడాకారులు సొంతం చేసుకోగా.. అందులో వారు చెల్లించాల్సిన ట్యాక్స్​ ఎంత? వేటివేటికి మినహాయింపు ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

Will Olympics gold medal winner Neeraj Chopra, other medalists have to pay tax on prize money?
పతక విజేతలకు భారీ నజరానాలు - పన్ను కట్టాలా?

By

Published : Aug 9, 2021, 8:03 PM IST

టోక్యో ఒలింపిక్స్​(Tokyo Olympics) వేదికగా అథ్లెటిక్స్​లో భారత్​కు ఏకైక స్వర్ణ పతకాన్ని తెచ్చిన ఘనత సాధించాడు జావెలెన్​ త్రో క్రీడాకారుడు నీరజ్​ చోప్డా. ఇతనితో పాటు మరో ఆరు పతకాలు భారత్​ను వరించాయి. ఈ సందర్భంగా నీరజ్​, మీరాబాయి చాను (Chanu Saikhom Mirabai), పీవీ సింధు(PV Sindhu) సహా మిగిలిన పతక విజేతలకు రాష్ట్ర ప్రభుత్వాలు సహా పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటించారు. ఇప్పుడు.. ఒక్కో అథ్లెట్​కు ఎన్ని కోట్లు వచ్చాయో అని సాధారణ ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వారు అందుకున్న దానిపై ట్యాక్స్​ కట్టాల్సిందేనా? అనే సందేహం మీకు వచ్చిందా..?

అథ్లెట్లకు ఇచ్చిన బహుమానాలు ట్యాక్స్​ రహితమా?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 10(17ఏ) ప్రకారం.. ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కొన్ని రివార్డులపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మినహాయింపును ఇస్తుంది. ఈ నిబంధనను 1989 ఏప్రిల్​ 1న చట్టంలో పొందుపరిచినా.. 2014 జనవరి 28 నుంచి ఈ చట్టాన్ని సీబీడీటీ అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్​, కామన్​వెల్త్​ గేమ్స్​, ఏషియన్​ గేమ్స్​లో ఏదైనా పతక విజేత అందుకున్న నగదు లేదా ఏ విధమైన రివార్డుకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

సింధుకు రూ. 30 లక్షలు.. పన్ను కట్టాలా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నగదు లేదా రివార్డులు ట్యాక్స్​ రహితం. ఉదాహరణకు టోక్యో ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత పీవీ సింధుకు(PV Sindhu) ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలు నజరానాను ప్రకటించింది. అయితే దీనికి ఆమె ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

చోప్డాకు కారు..

అయితే స్వర్ణ పతక విజేత నీరజ్​ చోప్డాకు (Neeraj Chopra) ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్​ మహీంద్రా (Anand Mahindra) బహుమానంగా ఇచ్చిన ఎక్స్​​యూవీ కారుకు ఆయన ట్యాక్స్​ పే చేయకుంటే.. ఆ కారు విలువలో నుంచి 30 శాతం పన్ను నీరజ్​ చెల్లించాల్సి ఉంటుంది.

హరియాణా రాష్ట్ర ప్రభుత్వం నీరజ్​ చోప్డాకు రూ.6 కోట్ల నగదు బహుమానం ప్రకటించగా.. పంజాబ్​ రూ.2 కోట్లు, మణిపుర్​ రూ.కోటి నజరానా ప్రకటించాయి. ఇన్​కమ్​ ట్యాక్స్​ నిబంధనల ప్రకారం ఈ నజరానాలకు.. ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇలాంటి పన్ను ఎవరికి మినహాయింపు? ఎవరికి వర్తింపు?

సీబీడీటీ నిబంధనల ప్రకారం మెడల్​ సాధించిన వారికి మాత్రమే నగదు బహుమానంలో పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే భారత మహిళల హాకీ టీమ్​లోని హరియాణాకు చెందిన 9 మంది క్రీడాకారిణులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. ఈ మొత్తం నుంచి ట్యాక్స్​ కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ జట్టు ఒలింపిక్స్​లో ఎలాంటి పతకం సాధించని కారణంగా ప్రతి క్రీడాకారిణి పన్ను కట్టాల్సి ఉంది.

సాధారణంగా ఎంత ట్యాక్స్​ కట్టాలి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మొత్తం కాకుండా ఇతర నగదు బహుమానాల నుంచి సాధారణంగా 30 శాతం పన్ను విధిస్తారు. ఆ విధంగా బహుమానంగా పొందిన ఇతర క్రీడాకారులు అందుకున్న బహుమానం నుంచి 30 శాతం కచ్చితంగా పన్ను చెల్లించాలి.

ఒలింపిక్​ పతక విజేతలకు దక్కిన బహుమానాలు:

నీరజ్​ చోప్డా (స్వర్ణం)

నీరజ్​ చోప్డా

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్​కు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్ల నగదు, ఏ-క్లాస్​ ఉద్యోగం సహా 50 శాతం రాయితీతో నివాస స్థలం ఇవ్వనుంది. పంజాబ్​ ప్రభుత్వం రూ.2 కోట్లు, బైజూస్​ కంపెనీ రూ.2 కోట్ల నగదుతో పాటు మణిపుర్​ ప్రభుత్వం, బీసీసీఐ, చెన్నై సూపర్​కింగ్స్​ రూ.కోటి నజరానా ప్రకటించాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్​ మహేంద్రా నుంచి ఎక్స్​యూవీ-700 మోడల్​ వాహనం, ఇండిగో ఎయిర్​లైన్స్​లో ఏడాది పాటు ఉచిత ప్రయాణం వెసులుబాటును కల్పించాయి.

మీరాబాయి చాను(రజతం)

మీరాబాయి చాను

వెయిట్​లిఫ్టింగ్​లో సిల్వర్​ పతకాన్ని సాధించిన మణిపుర్​ వెయిట్​లిఫ్టర్​ మీరాబాయి చానుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి బహుమానంగా ప్రకటించింది. రైల్వే శాఖలో పనిచేస్తున్న ఆమెకు పదోన్నతి ఇవ్వడమే కాకుండా.. రూ.2 కోట్ల నజరానాను ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ​మరోవైపు భారత క్రికెట్​ నియంత్రణ మండలి.. మీరాబాయి చానుకు రూ.50 లక్షల నగదు బహుమానాన్ని ప్రకటించింది.

రవి దహియా(రజతం)

రవి కుమార్​ దహియా

రెజ్లింగ్​లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న రెజ్లర్​ రవి దహియాకు హరియాణా ప్రభుత్వం రూ.4 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో పాటు బీసీసీఐ రూ.50 లక్షల బహుమానాన్ని రవికి అందజేయనున్నట్లు ప్రకటించింది.

పీవీ సింధు (కాంస్యం)

పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రూ.30 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. అదే సింధుకు బీసీసీఐ రూ.25 లక్షలను బహుమానంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.

బజరంగ్​ పునియా (కాంస్యం)

బజ్​రంగ్​ పునియా

ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్​ బజరంగ్​ పునియాకు హరియాణా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో పాటు బీసీసీఐ రూ.25 లక్షలను అందించనుంది.

లవ్లీనా బోర్గోహైన్​ (కాంస్యం)

లవ్లీనా బోర్గొహైన్​

విశ్వక్రీడల్లో కాంస్య పతకం సాధించిన బాక్సర్​ లవ్లీనా బోర్గోహైన్​కు రూ.50 లక్షల నజరానాను అసోం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు క్లాస్​ వన్​ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పాటు బీసీసీఐ మరో రూ.25 లక్షలను బహుమానంగా అందజేయనుంది.

పురుషుల హాకీ టీమ్​(కాంస్యం)

భారత పురుషుల హాకీ టీమ్​

ఒలింపిక్స్​లో పతకం సాధించిన భారత హాకీ టీమ్​లోని హరియాణా ఆటగాళ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్లను ప్రకటించింది. అదే విధంగా తమ క్రీడాకారులకు పంజాబ్​ రాష్ట్రం రూ.కోటి నజరానాను ఇవ్వనుంది. ఈ జట్టు మొత్తానికి రూ.1.25 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి..భారత్​కు ఒలింపిక్ అథ్లెట్లు.. సాయంత్రం సన్మానం

ABOUT THE AUTHOR

...view details