టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత హాకీ క్రీడాకారుడు రూపీందర్ పాల్ సింగ్ ఆటకు రిటైర్మెంట్(Rupinder Pal Singh Retirement) ప్రకటించాడు. గురువారం నుంచి తన హాకీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు. చాలా ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) భారత హాకీ జట్టు తరఫున పతకం గెలవడం సంతోషాన్నిచ్చిందని అన్నాడు.
"అందరికీ నమస్కారం. భారత హకీ టీమ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. నా జీవితంలోని గత కొన్ని నెలలు ఎంతో ఉత్తమంగా గడిచాయి. టోక్యో ఒలింపిక్స్ వేదికగా సహచర క్రీడాకారులతో కలిసి ఎన్నో అనుభూతులను పంచుకున్నాను. నా జీవితంలో అత్యంత నమ్మశక్యం కాని అనుభూతులు అవి. గత 13 ఏళ్లుగా భారతదేశానికి ఆడటం గొప్పగా భావిస్తున్నాను. ప్రతిభావంతులైన క్రీడాకారులకు మార్గదర్శనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 223 మ్యాచుల్లో ఇండియా జెర్సీ ధరించే గౌరవం దక్కడం అనిర్వచనీయం. ఈ గొప్ప క్రీడను ఇష్టపడే దేశం కోసం ఆడే అవకాశం నాకు దక్కింది."
- రూపీందర్ సింగ్, భారత మాజీ హాకీ క్రీడాకారుడు