Lakshya Sen: 'సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300' టోర్నమెంట్లో పాల్గొనడం లేదని ప్రకటించాడు ఇండియా ఓపెన్ 2022 ఛాంపియన్ లక్ష్య సేన్. గతేడాది అక్టోబర్ నుంచి తీరిక లేకుండా బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొంటున్నానని, శారీరకంగా ఎంతో అలసిపోయినందు వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్వాహకులకు ఓ లేఖలో తెలిపాడు. మార్చి నుంచి అన్ని టోర్నీలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
"ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేశా. ఇప్పుడు బాగా అలసిపోయినట్లు అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీలో పాల్గొంటే న్యాయం చేయలేను అనే భయాందోళన ఉంది. అందుకే టోర్నీకి దూరంగా ఉండాలని భావిస్తున్నా. నా కోచ్‌లు, ఫిజియోలు, కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. టోర్నీ నుంచి వైదొలుగుతున్నందుకు నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నా. వాళ్లు నా పరిస్థితిని అర్థం చేసుకుంటారనే విశ్వాసం ఉంది. టోర్నమెంట్ సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నా. ఇందులో పాల్గొంటున్న అందరికీ, ప్రత్యేకించి భారత ఆటగాళ్లకు విషెస్ చెబుతున్నా."
-లక్ష్య సేన్
India open 2022 champion
దిల్లీ వేదికగా జరిగిన ఇండియా ఓపెన్ 2022లో గెలిచి వరల్డ్ ఛాంపియన్ లోహ్ కీన్యూకు షాక్ ఇచ్చాడు లక్ష్యసేన్. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ యువకెరటం గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 9 టోర్నీల్లో పాల్గొన్నాడు. తీరిక లేకండా షటిల్ ఆడుతున్నాడు. డచ్ ఓపెన్‌లో ఫైనల్స్ చేరడమే గాక, హైలో టోర్నీలో సెమీఫైనల్స్, వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో నాకౌట్ దశకు చేరాడు.