టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం (T20 world cup 2021) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలుస్తుందో అని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న టీమ్ఇండియాకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్ జట్టును తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్‌లో భారత్ ప్రపంచంలోని అన్ని జట్లకన్నా అత్యుత్తమంగా కనిపిస్తోంది. భారత్‌లో రోహిత్‌శర్మ ఉంటే పాక్‌లో (india vs pak match) బాబర్ అజామ్ ఉన్నాడు. ఇటు.. కోహ్లీ, రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలతో టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ దృఢంగా కనిపిస్తుంటే దాయాది జట్టులో మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, సీనియర్ షోయబ్ మాలిక్ ఉన్నారు. భారత్‌లో చివరి వికెట్ వరకూ పరుగులు రాబట్టగల ఆటగాళ్లు ఉండగా.. పాక్‌లో పరిస్థితి అలా లేదు. బాబర్ అజామ్‌పైనే ఎక్కువ ఆధారపడుతున్న పాక్.. ఇటీవల అతడు విఫలమైతే పేకమేడలా కుప్పకూలుతోంది.
దశాబ్దాలుగా పాకిస్థాన్ జట్టు ప్రధాన బలం బౌలింగ్. కానీ గతమెంతో ఘనకీర్తి కలిగిన పాక్ బౌలింగ్ ఇప్పుడు భారత్ అంత దృఢంగా లేదు. భారత్‌లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ పేస్ దళాన్ని మోస్తున్నారు. శార్దూల్, జడేజా, అశ్విన్ అల్‌రౌండర్లుగా సత్తా చాటుతున్నారు. కానీ పాక్‌లో షాహీన్ అఫ్రిది ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తుండగా.. హారిస్ రౌఫ్, హసన్ అలీ ఎప్పుడెలా బంతులేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గతంలో అద్భుత స్పిన్నర్లు ఉండే పాక్‌లో ప్రస్తుత జట్టులో చెప్పుకోదగ్గ స్పిన్నరే లేడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ పాక్ బౌలింగ్ బలహీనతను బయటపెట్టింది. ఈ మ్యాచ్‌లో 186 పరుగులు చేసినా పాక్‌కు ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లను సఫారీలు దంచికొట్టారు. భారత్ పేస్, స్పిన్ దళాలు బలంగా కనిపిస్తుండగా పాక్‌లో మాత్రం పేస్ బౌలింగ్ పర్వాలేదనిపించినా స్పిన్ దళం మాత్రం బలంగా లేదు.
తక్కువ అంచనా వేయలేం..