టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) సాధించే అర్హత ఉన్న జట్టు ఏదంటే మాజీలు సహా ప్రతి ఒక్కరూ ఠక్కున భారత్ పేరు చెబుతారు. టీమ్ఇండియా ఫామ్‌ను బట్టి ఆ అంచనాకు వస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్(Nasser Hussain News) మాత్రం విభిన్నంగా విశ్లేషించాడు. నాకౌట్ స్టేజ్ (సెమీఫైనల్స్)లో టీమ్ఇండియాను ఎవరైనా ఓడించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించాడు.
"టీ20 గేమ్‌లో ఎవరినీ ఫేవరేట్‌గా పరిగణించలేం. వ్యక్తిగత ప్రదర్శనే కీలకమవుతుంది. మూడే మూడు డెలివరీలతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోవచ్చు. అందుకే నాకౌట్‌లో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. అదే క్రమంలో ఏ జట్టైనా టీమ్ఇండియాను చిత్తు చేయొచ్చు" అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ టాప్-ఆర్డర్ బ్యాటర్లు విఫలమైతే భారత్ జట్టు వద్ద ప్లాన్-బి లేదని.. అదే మైనస్‌గా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
"గత వన్డే ప్రపంచకప్‌ను ఓసారి పరిశీలిస్తే.. చివరి వరకు న్యూజిలాండ్ అద్భుతంగా ఉంది. ప్లాన్-బి లేకపోవడం వల్ల తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లోనూ తడబాటుకు గురైంది. అదే బాటలో ప్రస్తుత టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న టీమ్ఇండియాకు కూడా ప్లాన్-బి లేదు. నాకౌట్‌లో ప్రతి జట్టు శాయశక్తులా విజయం కోసం ఆడతాయి. ప్రతి ఒక్కరూ తామే గెలుస్తాం అని అనుకుంటూ ఉంటారు. అభిమానులు కూడా పేపర్ మీద టీం లైనప్‌ను చూసి తమ జట్టే గెలుస్తుందని అనుకోవడం సహజమే. టీమ్ఇండియా టాప్-ఆర్డర్ సరిగా ఆడనప్పుడు మిగతా టీం సభ్యులు ఎలా ఆడతారో వేచి చూడాలి" అని నాసర్ హుస్సేన్ విశ్లేషించాడు. టీ20 ప్రపంచకప్ వేటను భారత్ అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో పోరుతో ప్రారంభిస్తుంది.
ఇదీ చదవండి: