గతేడాది ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టీమ్ ఇండియా ఎలా చెలరేగిందో తెలిసే ఉంటుంది. ఆడిన నాలుగు టెస్టుల్లో రెండింట్లో గెలిచి, ఒకటి ఓడింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అదే ఊపులో చివరి టెస్టు గెలిచి చారిత్రక సిరీస్ గెలుస్తుందనుకున్న తరుణంలో కరోనా కలకలం రేపింది. సిరీస్ తాత్కాలికంగా నిలిచిపోయింది. అప్పుడు నిర్వహించాల్సిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేశారు. ఆ మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
India vs England: గెలిస్తే అరుదైన ఘనత.. రీషెడ్యూల్ టెస్టు ప్రత్యేకతలివే!
గతేడాది ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో కరోనా కారణంగా రీషెడ్యూల్ అయిన ఆఖరి మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శుక్రవారమే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్. అయితే సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అప్పటికీ ఇప్పటికీ రెండు జట్లకు కెప్టెన్లు మారారు. అప్పుడు ఆడిన చాలా మంది ఇప్పుడు ఆయా తుది జట్లలో లేరు. ఈ మ్యాచ్‌కు ముందు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
india vs england test 2022
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిస్తే.. సిరీస్ సమం అవుతుంది. ఇండియా గెలిచినా, డ్రా చేసుకున్నా.. చారిత్రక సిరీస్ మన సొంతమే అవుతుంది. అప్పటికీ ఇప్పటికీ ఇరు జట్లలో చాలా మార్పులు వచ్చాయి. వాటితో పాటు ఈ మ్యాచ్‌కు ఉన్న విశేషాలు ఏంటంటే..
- గతేడాది జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా జో రూట్.. కోచ్‌గా సిల్వర్ వుడ్ ఉండగా.. టీమ్ ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. కోచ్‌గా రవిశాస్త్రి ఉండేవారు. ఇప్పుడు మొత్తం తారుమారైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్.. టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ(కరోనాతో దూరమైన తర్వాత.. బుమ్రాను నియమించారు), కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతల్లో ఉన్నారు.
- 2007 తర్వాత.. ఇంగ్లాండ్‌పై ఇంగ్లాండ్‌లో ద్వైపాక్షిక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం టీమ్ ఇండియాకు ఉంది. చివరి టెస్టులో గెలిచినా, డ్రా చేసుకున్నా ఇది సాధ్యం అవుతుంది.
- ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్ వరుసగా మూడు టెస్టులు గెలిచి జోరు మీద ఉంది. అంతకుముందు ఒక్కసారే 3 అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు వరుసగా గెలిచింది ఆతిథ్య జట్టు. అదీ 2014,15ల్లో ఇండియాపై 4 మ్యాచ్‌ల్లో వరుసగా గెలిచింది.
- చివరి టెస్టుల్లో ఇండియా గెలిస్తే.. విదేశాల్లో మన అత్యధిక టెస్టు విజయాలు ఇంగ్లాండ్‌పైనే ఉండనున్నాయి. ఇప్పటివరకు భారత్.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంకల్లో 9 మ్యాచ్‌ల చొప్పున గెలిచాయి. అయితే.. ఈ నాలుగు దేశాల్లో భారత విజయాల శాతం ఇంగ్లాండ్‌లోనే తక్కువగా ఉండటం గమనార్హం. అక్కడ 67 టెస్టులాడితే 9 మ్యాచ్‌ల్లోనే టీమ్ ఇండియా గెలిచింది.
- భారత్ చివరి టెస్టు ఆడుతున్న బర్మింగ్‌హామ్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. మొత్తం 7 ఆడగా.. ఒకటి డ్రా చేసుకొని, ఆరింట్లో ఓడింది. ఇంగ్లాండ్‌లో భారత్ 5 టెస్టుల కంటే ఎక్కువ ఆడి ఓడిపోయిన వేదికల్లో మరోటి ఓల్డ్ ట్రాఫోర్డ్ మాత్రమే. అక్కడ 9 ఆడి.. నాలుగు ఓడిపోయింది. 5 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.
- భారత్ విదేశాల్లో చివరిగా ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అంతకుముందు చివరకు ఇలా 2020లోనే జరిగింది.
- పురుషుల టెస్టు క్రికెట్లో 2020 నుంచి.. మొత్తం పరుగుల్లో బౌండరీల ద్వారా సాధించిన రన్స్‌లో (53 శాతం) ఇండియా టాప్‌లో ఉంది. 49 శాతంతో ఇంగ్లాండ్ ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.
- ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో.. తాను ఆడిన చివరి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించాడు. అంతకుముందు ఒక్కసారే ఇలా చేశాడు. అది కూడా ఈ ఏడాదే కావడం విశేషం. 2022లో 64.5 సగటుతో 774 పరుగులతో ఉన్నాడు. ఒక ఏడాదిలో ఇన్ని పరుగులు చేయడం అతడికి రెండో అత్యధికం. 2016లో మొత్తం 1470 రన్స్ చేశాడు బెయిర్‌స్టో.
- మరో 5 వికెట్లు తీస్తే.. బర్మింగ్‌హామ్‌లో 50 వికెట్ల ఘనతను సొంతం చేసుకుంటాడు ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్. అంతకుముందు లార్డ్స్(116), ట్రెంట్ బ్రిడ్జ్ (73) వేదికల్లోనూ 50కిపైగా వికెట్ల చొప్పున తీశాడు.
- మరో 69 పరుగులు చేస్తే పురుషుల టెస్టు క్రికెట్లో.. 3000 పరుగులు, 100 వికెట్లు సాధించిన మూడో భారతీయుడిగా నిలుస్తాడు రవిచంద్రన్ అశ్విన్. ఇంగ్లాండ్‌పైనా అత్యధిక టెస్టు వికెట్ల వీరుడిగా నిలిచేందుకు కూడా మరో 8 వికెట్లు తీస్తే చాలు. ఈ జాబితాలో బీఎస్ చంద్రశేఖర్-95, అనిల్ కుంబ్లే-92 తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- ఇంగ్లాండ్‌పై టెస్టు క్రికెట్లో 50 వికెట్లు సాధించిన తొమ్మిదో భారత బౌలర్‌గా నిలిచేందుకు మహ్మద్ షమీకి మరో 8 వికెట్లు అవసరం. విదేశాల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా నిలిచేందుకు 6 వికెట్లు తీస్తే చాలు. ప్రస్తుతం విదేశాల్లో 147 వికెట్లు తీసిన షమీ.. హర్భజన్‌ను(152) దాటే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:ఇంగ్లాండ్ 2.0తో బుమ్రా సేన ఢీ.. గెలిస్తే చరిత్రే.. కానీ..!