IND vs SA 2nd Test Preview: స్వదేశీ పిచ్‌లపై ఏ జట్టైనా సింహమే కానీ వేరే దేశంలో గెలిస్తేనే అసలు మజా. ఇదే మాటను నిజం చేస్తూ గత మూడేళ్లుగా టీమ్ఇండియా విదేశాల్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాలో రెండు సార్లు టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఇంగ్లాండ్‌లోనూ మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో ఏడుసార్లు పర్యటించినా.. టెస్టు సిరీస్ అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. ఈ అపఖ్యాతిని తొలగించుకోవాలనే లక్ష్యంతో కోహ్లీసేన సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బాక్సింగ్ డే టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఫామ్‌ను రెండో టెస్టులోనూ కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో సన్నద్ధం అవుతోంది. కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి సైతం ఈ సిరీస్ గెలుపు ఎంతో ముఖ్యం. సుదీర్ఘ ఫార్మాట్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పే కోహ్లీ టెస్టు మ్యాచ్ ద్వారానే మునుపటి ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో బరిలోకి దిగిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మినహా మిగతా బ్యాటర్లు తొలి టెస్టులో ఆశించిన మేర రాణించలేదు. రెండో టెస్టులో వారంతా ఫామ్ అందుకోవాలని జట్టు భావిస్తోంది. ఫామ్‌లేక తంటాలు పడుతున్న పుజారా, రహానేలకు మరోసారి అవకాశం దక్కొచ్చు. ఐదుగురు బౌలర్లతో భారత్ ఆడే అవకాశం ఉంది. బౌలర్లలో బుమ్రా, మహ్మద్ షమి, సిరాజ్ తొలిటెస్టులో ఆకట్టుకున్నారు. శార్దూల్ ఠాకూర్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకవేళ శార్దూల్‌ను తప్పించాలని భావిస్తే ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్ యథావిథిగా కొనసాగే ఆస్కారం ఉంది.
మరోవైపు, సీనియర్ల రిటైర్మెంట్‌తో బలహీన పడ్డ సౌతాఫ్రికాకు కీపర్ క్వింటన్ డికాక్ సైతం దూరం కావడం ఇబ్బందిగా మారింది. అన్ని రంగాల్లో.. పటిష్టంగా కనిపిస్తున్న భారత్‌ను అడ్డుకోవాలంటే.. ఆ జట్టు సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌లో బలహీనంగా కనిపిస్తున్న ప్రొటీస్ జట్టు బౌలింగ్‌లో మాత్రం పటిష్టంగా ఉంది. రబాడా, ఎంగిడి మంచి ఫామ్‌లో ఉండటం కలిసొస్తుందని భావిస్తోంది. తుదిజట్టులో పలు మార్పులతో సౌతాఫ్రికా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. జోహ్నస్ బర్గ్ వేదికగా సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.