తెలంగాణ

telangana

టెస్టు క్రికెట్‌కు డేవిడ్​ వార్నర్‌ గుడ్​బై.. అదే లాస్ట్​ సిరీస్​!

By

Published : Jun 3, 2023, 9:07 PM IST

David Warner Retirement : ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ మరికొన్ని నెలల్లో టెస్టు క్రికెట్​కు ముగింపు పలకనున్నాడు. ఈ క్రమంలో 2024 జనవరిలో పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్.. తన కెరీర్​లో చివరదని వార్నర్​ వెల్లడించాడు.

Warner Retirement
Warner Retirement

David Warner Retirement : ఆస్ట్రేలియా స్టార్​ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 జనవరిలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీసే తాను ఆడబోయే చివరిదని ప్రకటించాడు. జూన్ 7న భారత్‌, ఆసీస్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు యాషెస్‌ సిరీస్‌లో తుదిజట్టులో చోటు దక్కడం కోసం మెరుగైన ప్రదర్శన చేస్తానని వార్నర్​ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు వివరించాడు. 2024 ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నానని చెప్పిన వార్నర్​.. ఆ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని సూచనాప్రాయంగా చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ మాత్రం ఆడతానని చెప్పాడు.

"హోం గ్రౌండ్ సిడ్నీలో పాకిస్థాన్‍తో జరిగే ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత టెస్టు క్రికెట్‍కు నేను వీడ్కోలు పలకాలనుకుంటున్నాను. అయితే వెస్టిండీస్, అమెరికాల్లో సంయుక్తంగా జరిగే 2024 ప్రపంచకప్‍ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్​లో ఉండాలని అనుకుంటున్నాను. జట్టులో ఉండాలంటే స్కోర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎప్పుడూ చెబుతున్నా.. ప్రపంచకప్ (2024) నా చివరి గేమ్ కావొచ్చు" అని అన్నాడు.

David Warner Stats : వార్నర్‌ టెస్టు కెరీర్‌ విషయానికొస్తే ఇప్పటివరకు అతడు ఆడిన 103 మ్యాచ్‌ల్లో 45.57 సగటుతో 8,158 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 34 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్‍తో ఈ ఏడాది జరిగే యాషెస్‍పై పూర్తి దృష్టి సారించనున్నాడు వార్నర్. అందుకే వెస్టిండీస్ సిరీస్ ఆడబోనని స్పష్టం చేశాడు.

Warner Ball tampering : తాజాగా వార్నర్​​ క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి విరుచుకుపడ్డాడు. తన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని అతను అన్నాడు. అలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో బాల్ టాంపరింగ్ విషయంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాటే అతడి కెప్టెన్సీపై జీవితకాలం బ్యాన్​ విధించింది. అయితే ఈ టాంపరింగ్​లో వార్నర్​తో పాటు ఉన్న స్టీవ్‌ స్మిత్‌పై అంతగా కఠిన చర్యలు తీసుకోలేదు క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో స్మిత్​.. మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యాడు. అలాగే ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో టీమ్​ను కూడా ముందుండి నడిపిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details