తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లతా మంగేష్కర్.. నటిగా ఎంట్రీ, స్టార్ సింగర్​గా చరిత్ర!

LATA MANGESHKAR LIFE FACTS: ప్రముఖ గాయని లతా మంగేష్కర్​.. అనారోగ్య సమస్యతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నటిగా కెరీర్​ మొదలుపెట్టి.. భారతదేశం గర్వించదగ్గ సింగర్​గా​ ఎలా ఎదిగారో చెప్పేదే ఈ ప్రత్యేక కథనం.

lata mangeshkar
లతా మంగేష్కర్

By

Published : Feb 6, 2022, 10:05 AM IST

Lata mangeshkar died: ఆ గానానికి వసంతమే తప్ప శిశిరం లేదు. భావం తప్ప భాష తెలీదు. ఆ గొంతు నుంచి జాలువారే పాట వింటే సాటి, పోటీ రాగల గళం మరొకటి లేదనిపిస్తుంది. దశాబ్దాలు గడిచినా మాధుర్యం తరగని స్వరం సొంతం. ఆమెనే సంగీత సాగరాన్ని మధించిన భారత కోకిల లతా మంగేష్కర్. ఆమె జీవిత ప్రయాణం ఎందరో భావి గాయకులకు ఆచరణీయం, స్ఫూర్తి దాయకం.

లతా మంగేష్కర్

మాట్లాడే వయసులోనే పాటలు

దశాబ్దాల పాటు ఎన్నో అద్భుత గీతలకు తన స్వరంతో ప్రాణ ప్రతిష్ట చేసిన లతా.. 1929 సెప్టెంబరు 28న ఇండోర్​లో జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు మొదటి సంతానం. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద... ఐదేళ్ల వయుసులోనే ఓనమాలు నేర్చుకున్నారు.

నటి-గాయనిగా ఇండస్ట్రీలోకి ప్రవేశం

13 ఏళ్ల వయుసులో తండ్రి మరణంతో కుటుంబ భారం లతాపై పడింది. ఆ సమయంలో సినీ రంగంలోకి నటి, గాయనిగా ప్రవేశించారు. 1942-48 మధ్య కాలంలో దాదాపు 8 చిత్రాల్లో నటించారు. వీటిలో చిముక్లా సుసార్, గజెభావు, జీవన్​యాత్ర, మందిర వంటి సినిమాలు ఉన్నాయి. 1942లో వచ్చిన 'పహ్లా మంగళ్ గౌర్​'లో హీరోయిన్​ చెల్లెలుగా కనిపిస్తూ, రెండు పాటలు కూడా లతా పాడారు.

యుక్త వయసులో లతా మంగేష్కర్

వారి వెళ్లిపోవడం లతాకు కలిసొచ్చింది!

లతా నేపథ్య గాయకురాలిగా కొనసాగుతున్న కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ గాయనిలుగా వెలుగుందుతున్నారు. దేశ విభజన సమయంలో వీరు పాకిస్థాన్‌ వెళ్లడం.. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత పెరగడం లతా మంగేష్కర్​కు కలిసొచ్చింది. తర్వాత మంచి నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు.

పాడిన తొలి పాటను తొలగించారు!

సినీ ప్రయాణం ప్రారంభంలోనే లతా.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఓ మరాఠి చిత్రం కోసం ఆమె పాడిన తొలి పాటను తొలగించారు. ఆ తర్వాత 'మజ్‌బూర్‌'లోని 'దిల్ మేరా తోడా' పాట పాడారు. ఇది విన్న వారంతా ఆమెను విమర్శించారు. దీనిని సవాలుగా తీసుకున్న ఈమె.. ఉర్దూలో సంగీత శిక్షణ తీసుకున్నారు.

'మహల్​'తో లతా కెరీర్​లో ఓ మైలురాయి

అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లో లతా పాడిన పాటలు ఆమెకు స్టార్ సింగర్ హోదాను తెచ్చిపెట్టాయి. అనంతరం 'మహల్' సినిమాలోని ఆయేగా ఆయేగా పాటతో లతాజీ దశ తిరిగింది. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.

జాతీయ అవార్డు-గిన్నీస్ రికార్డు

లతా మంగేష్కర్‌.. 1990లో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. 'లేఖిని' సినిమా తీశారు. అందులో పాడిన ఓ పాటకు లతాజీకి జాతీయ అవార్డు వచ్చింది. అదే విధంగా 1948 నుంచి 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ పేరు సంపాదించారు.

లతా మంగేష్కర్

లతాను వరించిన అవార్డులు

లతా మంగేష్కర్.. గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న పురాస్కారాలతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది.

ఆయన పాటలకు లతా వీరాభిమాని

తన గళంతో ఎన్నో అద్బుతాలు సృష్టించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించకున్న లతా మంగేష్కర్‌.. కె.ఎల్ సైగల్ పాటలకు వీరాభిమాని.

లతాపై విషప్రయోగం

1962లో లతా మంగేష్కర్‌పై స్లో పాయిజన్‌ను ప్రయోగించారు. దీనివల్ల ఆమె దాదాపు 3 నెలల పాటు మంచం పట్టారు. ఆ విష ప్రయోగం చేసిందెవరో ఇప్పటికీ తేలలేదు. ఆమె వద్ద పనిచేసే వంటమనిషి.. ఈ ఘటన తర్వాత వేతనం తీసుకోకుండా అదృశ్యమవడం పలు అనుమానాలు రేకెత్తించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details