Lata Mangeshkar: సమ్మోహన స్వరకర్త లతా మంగేష్కర్

author img

By

Published : Jul 4, 2021, 9:32 AM IST

Updated : Jul 4, 2021, 11:40 AM IST

latha mangesker special story

ఆ స్వరం.. ఓ సమ్మోహన గళం.. ఆ గానం పాటకు పన్నీటి స్నానం.. ఆమె గీతం మనసు తాకే మధుర తుషారం. ఆమె పాట మంచు అద్దిన కశ్మీరీ అత్తరు పరిమళం. సంగీత లక్ష్మి సిగలో తురిమిన కాంతి లతాంతం. చక్రవాకాలు దాచుకుని అమృతం కురిపించే అమృత వర్షిణి. తొలి పొద్దులో భూపాలం. మలి సంజెలో దీపక రాగం. సప్త స్వరాలకు లతలా అల్లుకుని గాన మకరందాన్ని పంచుతున్న గాన వర్షిణి లతామంగేష్కర్. ఆ స్వర ధారలలో భూగోళమే సుడులు తిరిగింది. సంగీత జగం దోసిళ్లు పట్టింది.

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో సంగీత విద్వాంసుడు, నటుడు దీనానాథ్​ మంగేష్కర్, షేవంతిల ఇంట పల్లవించిన చిరుగమకం లత. చిన్నారి లత శ్రావ్యంగా పాడుతుంటే ముగ్ధుడైన తండ్రి.. ఆమెకు హిందుస్థానీ సంగీతం నేర్పారు. నాన్న ఇచ్చే నాటక కళా ప్రదర్శనల స్ఫూర్తితో ఐదో ఏటనే లతా మంగేష్కర్ కళావేదికలపై వేషాలతో మురిపించింది. గురువు అమాన్ అలీఖాన్ సాహెబ్​ దగ్గర ఉర్దూ హిందుస్థానీ ఘరానాల తరానాలు, సంగీత సంగతులు నేర్చింది. ఆ చల్లని సాంస్కృతిక సదనంలో పెరిగి పెద్దవుతున్న తరుణంలో ఓ ఉత్పాతం. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హఠాత్తుగా కన్నుమూశారు.

యవ్వన వీణలు మోగే వేళ.. బతుకులో భయోత్పాతం. అందమైన కలలు కనే వయసులో.. కుటుంబ పోషణ భారం లత భుజస్కంధాల మీద పడింది. ముగ్గురు చెల్లెళ్లు.. ఆశ, ఉష, మీనా, తమ్ముడు హృదయనాథ్.. కన్నతల్లి షేవంతిలకు అండగా నిలిచింది. మాస్టర్ వినాయక్.. లతకు సినిమాల్లో వేషాలిచ్చి ఆదుకున్నారు. అలా 'పెహ్లా మంగళ గౌర్', 'బడేమా' లాంటి సినిమాల్లో అవకాశాలొచ్చాయి.

latha mangesker special story
లతా మంగేష్కర్

సినిమాల్లో అవకాశం

లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలు పెట్టారు. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యం పెరగడం ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. సంగీత దర్శకుడు గులాం హైదర్ పరిచయంతో లతలో ఆశలు చిగురించాయి. తన సినిమా మజ్బూర్లో 'దిల్ మేరా తోడా' పాటతో ఆయన అవకాశమిచ్చారు. ఆ పాట రాజ్ కపూర్, నర్గీస్ నటిస్తున్న బర్సాత్ స్వరకర్త శంకర్-జైకిషన్ మనసు తాకింది. బర్సాత్​లో ఆయన లతామంగేష్కర్ కు నవ పారిజాతాల్లాంటి 9 పాటలిచ్చారు.

ఆమె కోసం బారులు తీరారు..

ప్రేక్షకులకు ఆట కావాలి. పాట కావాలి. స్వరాల సయ్యాట కావాలి. వెండితెరమీద రంగుల హరివిల్లు విరియాలి. కళాఖండాలిచ్చే వారికి కనకవర్షం కురియాలి. అందుకే సినీ ప్రపంచం పాటనే నమ్ముకుంది. కథానాయకులకు ఎందరు గాయకులు పాటలు పాడినా.. కథా నాయికలకు లతమ్మ లేనిదే గొంతు పెగలదు. మనవరాలి వయసులో ఉన్న కుర్ర హీరోయిన్లకు లతామంగేష్కర్ వేలాది పాటలిచ్చారు. ఆమె తరతరాల హీరోయిన్లకు తీయని గళమిచ్చారు. దర్శకులు లత ఒక్క పాటైనా పాడాలని ఇంటికి బారులుతీరారు. తొలి సినిమాలో నటించే హీరోయిన్లు తొలి పాట లతమ్మదే కావాలని పట్టుపట్టేవారు. వందలాది కథానాయికలకు వేయి గొంతుకల పాట లతా మంగేష్కర్.

లత పాటల వర్షానికి సంగీత ప్రపంచంలో క్రమంగా హర్షామోదాలు లభించాయి. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవి చూశాయి. ఆ తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని గీతాలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి.

latha mangesker special story
లతా మంగేష్కర్

హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కల్యాణ్​ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. దళసరి గళాల హిందీ నేపథ్యగాన ప్రపంచంలో సొగసైన పాటల శృతిమాధురిలా వచ్చిన లత సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించింది. 'ఆయెగా ఆనేవాలా' పాట లతామంగేష్కర్ కెరీర్ నే కాదు.. హిందీ నేపథ్యగాన దశనూ, దిశనూ మార్చివేసింది. ఒక నవశకానికి నాంది పలికింది.

మల్లెల ఘుమ ఘుమల్లేని వేసవి, చినుకు పడని వానాకాలం, లత గళం లేని సినిమా అసహజం అని సంగీత దర్శకులు భావించారు. 'భూమికి ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు. ఒకే లతామంగేష్కర్' అని గీత రచయిత జావేద్ అక్తర్​ ప్రశంసించారు. లతామంగేష్కర్ దాదాపు 170 మంది సంగీత దర్శకుల వద్ద 36 దేశ, విదేశీ భాషలలో 30 వేలకు పైగా పాటలు పాడారు. కిశోర్ కుమార్​తో కలసి 'గాతా రహా మేరా దిల్', 'నూరీ నూరీ ఆజారే (నూరీ)', 'సత్యం శివం సుందరం', 'సిల్సిలా' సినిమాల్లోని పాటలు చెవుల్లో అమృతాన్ని పోసినట్టు ఉంటాయి. వారి యుగళగీతాలకు భూదేవి మురిసి తానే హరివిల్లైంది.

స్వరాలన్నీ ఝరిలా ప్రవహించి పండు వెన్నెల్లో స్నానించి రాగ సుగంధ పరిమళాలతో స్పర్శించి రస హృదయాలను ఆనంద డోలికల్లో ఓలలాడిస్తే ఆ సురాగ, సరాగ మాలిక లతామంగేష్కర్. వెండితెరమీద స్వరాల సయ్యాట పాట. పాటకు లత గానం ఓ ప్రాణం. ఆ సేతు హిమాచలం లత పాటల పల్లకిలో విహరిస్తూ ఆస్వాదిస్తోంది. దశాబ్దాల ఆమె సుదీర్ఘ సంగీత యాత్రలో రవళించిన గీతికలు ఎన్నో, ఎన్నెన్నో. ఆ చంద్రతారార్కం వన్నె తగ్గని ఆమె పాటల్లో వెన్నెల వర్షిస్తూనే ఉంటుంది.

పరవశించి పలకరించిన పురస్కారాలు

గాన కోకిల లతా మంగేష్కర్ అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. 1942 నుంచి ఇప్పటివరకూ ఆమె సాగించిన 8 దశాబ్దాల పాటల ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతమై లతమ్మకు స్వరాభిషేకం చేశాయి. మన దేశ అత్యున్నత పౌరపురస్కారం పాటు మరికొన్ని అవార్డులు ఆమె గాత్ర మాధుర్యానికి పరవశించి పలకరించాయి.

1969 లో పద్మభూషణ్‌ అందుకున్న లతా మంగేష్కర్.

1989లో సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.

1999లో పద్మవిభూషణ్ ను అందుకున్నారు.

latha mangesker special story
లతా మంగేష్కర్

భారతరత్న..

తన గాత్ర మాధుర్యం ద్వారా దేశ ప్రజలను సంగీత ప్రపచంలో ఓలలాండించిన వైనం, కళారంగానికి అందించిన విశేషకృషికి గుర్తింపుగా షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్​తో కలిసి 2001లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు లతా మంగేష్కర్. కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తర్వాత భారతరత్న పొందిన రెండో గాయనిగా నిలిచారు. అంతేకాదు ఫ్రాన్స్ తమ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన లీజియన్ ఆఫ్ హానర్​ను 2006లో అందించి లతా మంగేష్కర్ సేవలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును అందించింది. 8 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో మూడు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు అందుకున్న లతా మంగేష్కర్.. నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నేపథ్య గాయనిగా.. రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ ప్రత్యేక పురస్కారాలతో పాటు ఫిల్మ్ ఫేర్ జీవితసాఫల్య పురస్కార గౌరవాన్ని పొందారు.

వీటితో పాటు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, నేపాల్ అకాడమీ అవార్డు సహా అనేక జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 1974లో లండన్​లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో సంగీత కచేరీ నిర్వహించిన లతా మంగేష్కర్.. ఆ ఘనతను, గౌరవాన్ని పొందిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పారు. ఇలా లతా మంగేష్కర్ సాధించిన ఘనతలు నభూతో నభవిష్యతి.! సంగీత ప్రపంచంలో, పాటల పూదోటలో లతా మంగేష్కర్​లా ఇంతటి సుదీర్ఘ ప్రయాణం సాగించిన, ఇతరలకు సాధ్యం కాని ఘనతలను కైవసం చేసుకున్న భారతీయ గాయని మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

latha mangesker special story
లతా మంగేష్కర్

1942లో ప్రారంభమైన లతా మంగేష్కర్ పాటల ప్రయాణం అనంతమైన జీవన వాహినీలా సాగిపోతోంది. తన తొలినాళ్లలోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లతా మంగేష్కర్ 1960ల నాటికి ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియలు దృష్టిని ఆకర్షించారు. ఆ ఒక్క దశాబ్దంలోనే 30వేల పాటలు పాడి గిన్నిస్ రికార్డును సృష్టించారు. అప్రతిహతంగా సాగిపోతోన్న ఈ సుదీర్ఘ పాటల ప్రయాణంలో ఎన్నో తరాలు ఆమె గాత్ర మాధుర్యానికి పులకించిపోయాయి. చైత్రమాసంలో పల్లవిస్తున్న ప్రకృతిని చూసి కోయిల పాడే పాటలా ఆమె గాత్రం నిత్య యవ్వనంతో పాటల ప్రేమికులను మైమరిపిస్తూనే ఉంది. అందుకే ఎన్నో విరుల బిరుదులు లతమ్మ మెడను అలకరించాయి.

కాలప్రవాహానికి ఎదురునిలిచే ఎన్నో మృదు మధుర గీతాలను తన గాత్రం ద్వారా జాలువార్చిన లతా మంగేష్కర్​ను 'గానకోకిల'గా, 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా అభిమాన ప్రపంచం కీర్తించటం ప్రారంభించింది. ఎస్ డీ బర్మన్ నుంచి ఆర్డీ బర్మన్ వరకూ, శంకర్- జై కిషన్ లాంటి సంగీత దర్శక ధీరులంతా లతా మంగేష్కర్​లోని గాత్రప్రతిభకు పట్టం కట్టారు. ఇన్ని దశాబ్దాలుగా పాడుతున్నా పాటల్లో ఇన్ని వందల వేల ప్రయోగాలు చేసినా ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకం. ఆ పాటకు కాలపరిమితి లేదు. అనంతమైన సంగీత ప్రయాణంలో ఆమె సాధించిన పురస్కారాలు, అందుకున్న గౌరవాలను మించి లతా మంగేష్కర్ పాడిన పాటలు ఓ మెట్టుపైనే నిలబడతాయి. సంగీత ప్రియులకు అలౌకికమైన ఆనందాన్ని అందిస్తూనే ఉంటాయి.

Last Updated :Jul 4, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.