భారత్‌లో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు కనకంపై ఆపేక్ష అధికం. భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగం. అక్షయ తృతీయ, ధన త్రయోదశి రోజుల్లో, పండుగలు పెళ్ళిళ్లు వ్రతాలు ఇతర శుభకార్యాలకు బంగారాన్ని కొనడం ధరించడం ఆనవాయితీ. అత్యంత ధనవంతుల నుంచి పేదల దాకా ఆయా సందర్భాల్లో ఎంతోకొంత స్వర్ణం కొనుగోలు చేస్తుంటారు.
సాధారణంగా బంగారం కొనేవారు రెండు రకాలుగా ఉంటారు. కొందరు దాన్ని సొంత వినియోగానికి కొలుగోలు చేస్తారు. మరికొందరు ధర పెరిగినప్పుడు విక్రయించే ఉద్దేశంతో స్వర్ణంపై మదుపు చేస్తారు. మొదటి వర్గానికి చెందినవారు సాధారణంగా తక్కువ పరిమాణంలో బంగారం కొంటుంటారు. మదుపరులు అధిక పరిమాణంలో కొనుగోలు చేస్తారు. పెళ్ళిళ్లు వంటి సందర్భాల్లో సామాన్యులు బంగారం ధర ఎంత అధికంగా ఉన్నా దాన్ని కొనుగోలు చేస్తారు. మదుపరులు మాత్రం కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. పరిస్థితులు సానుకూలంగా లేకపోతే వారు కొనడం వాయిదా వేస్తుంటారు. విదేశీ పెట్టుబడిదారులైతే ఆదాయం అధికంగా వచ్చే వాటిలోనే మదుపు చేస్తారు. బంగారం కన్నా బాండ్లపైనే వారు అధికంగా ఆసక్తి చూపుతారు. అందులోనూ డాలరు బలపడుతున్న రోజులివి.
భారీ నష్టం
చైనా తరవాత భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు. ఇండియాలోని కుటుంబాల వద్ద పోగై ఉన్న పసిడి దాదాపు 25,000 టన్నులు ఉంటుందని ప్రపంచ స్వర్ణమండలి అంచనా వేసింది. కరోనా కష్ట కాలంలో అల్పాదాయ కుటుంబాలు, ఉపాధి కోల్పోయినవారు తమవద్ద ఉన్న బంగారాన్ని కుదువపెట్టి కాలం గడిపారు. భారత్ తన బంగారం అవసరాల్లో ఇంచుమించు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అయితే, ఇండియాలోకి బంగారం అత్యధికంగా అనధికార మార్గాల నుంచే వస్తోంది. దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరైన ఫలితాలను ఇవ్వడంలేదు.
2021లో అధికార మార్గాల ద్వారా దశాబ్ద రికార్డు స్థాయిలో రూ.4.5 లక్షల కోట్ల విలువైన 1,050 టన్నుల బంగారం భారత్‌కు దిగుమతి అయ్యింది. అంతకుముందు సంవత్సరం అది 430 టన్నులే. ఏడాదిలో దిగుమతులు 145శాతం మేర పెరిగాయి. దిగుమతి అయిన బంగారంలో కొంతభాగంతో ఆభరణాలు తయారుచేసి మళ్ళీ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. దానిపై సుంకం విధించరు. కానీ దీనిలో అధికభాగం దొంగతనంగా స్వదేశంలోనే విక్రయమవుతోంది. ఫలితంగా సుంకం, జీఎస్‌టీ రూపంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇలా ఏటా భారత్ సుంకం రూపంలో సుమారు రూ.5,700 కోట్లు, జీఎస్‌టీ రూపంలో రూ.2,400 కోట్లు నష్టపోతోంది. దొంగ మార్గంలో వచ్చే పసిడివల్లా ప్రభుత్వానికి ఆదాయ నష్టం తప్పడంలేదు. ఏటా రూ.52,000 కోట్ల విలువైన సుమారు 170 టన్నుల పసిడి పన్ను పరిధి నుంచి తప్పించుకొంటోందని, తద్వారా సర్కారు రూ.8,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోందని భారత స్వర్ణ విధాన కేంద్రం వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి తరవాత బంగారం ధరలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. సాధారణంగా ధనత్రయోదశి, దీపావళి రోజుల్లో బంగారం ధరలు జోరందుకుంటాయి. ఈసారి దానికి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి పలు కారణాలున్నాయి. అమెరికాతోపాటు కొన్ని అగ్రదేశాలు వడ్డీరేట్లను పెంచాయి. అందువల్ల బంగారంకన్నా వడ్డీ ఆదాయం అధికంగా వచ్చే బాండ్లవైపు మదుపరులు మొగ్గుతున్నారు. 2020లో కరోనా వల్ల ఆర్థిక అస్థిరత నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సహజంగా పసిడి వైపు మళ్ళారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కుదుటపడటంతో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అమెరికా డాలర్ బలపడటంతో మదుపరులు డాలరుతో కూడిన పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు. డాలరు బలపడితే బంగారం ధర తగ్గుతుంది.
అక్రమ రవాణాకు ఆస్కారం
పసిడిని లోహం, ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. కొందరు పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు కొంటుంటారు. వర్తకులు ఆ పాత బంగారాన్ని కరిగించి, మళ్ళీ విక్రయానికి తెస్తారు. ఈ విషయంలో చైనా, ఇటలీ, అమెరికా తరవాత భారత్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. నిరుడు భారత్ 75 టన్నుల పసిడిని కరిగించి, మళ్ళీ అందుబాటులోకి తెచ్చింది. బంగారం కొనుగోలు సమయంలో నగదు చెల్లింపులు కేవలం రూ.1.99 లక్షల వరకే సాధ్యం. అంతకు మించితే పాన్‌కార్డు నంబరు చెప్పాల్సి ఉంటుంది. దాని నుంచి తప్పించుకొనేందుకు కొందరు ఒకటికన్నా ఎక్కువ రసీదులు, పలువురి పేర్లపై స్వర్ణం కొంటున్నారు. ద్రవ్యోల్బణం, బలమైన డాలరు బంగారం కొనుగోలును నిరోధిస్తాయి. దేశీయంగా పసిడికి గిరాకీ పెరిగినా ఇబ్బందే. ఆ డిమాండును దిగుమతుల ద్వారా భర్తీచేయాలి. ఆ ప్రభావం వాణిజ్య లోటుపై పడుతుంది. దిగుమతులను నిరుత్సాహ పరిచేందుకు, ఫారెక్స్ నిల్వలను సంరక్షించేందుకు కేంద్రం దిగుమతి సుంకాన్ని 10.75శాతం నుంచి 15శాతానికి పెంచింది. ఇది అక్రమ రవాణాకు దారితీసే ప్రమాదం ఉంది. బంగారంపై సుంకం పెరిగేకొద్దీ దొంగ రవాణా మరింత అధికమవుతుంది.
పెరిగిన పోటీతత్వం
బంగారం విక్రయంలో పెద్దపెద్ద ప్రాంతీయ, దేశీయ రిటైల్ గొలుసుకట్టు దుకాణాలు తెరపైకి రావడం భారత్‌లో ఒక పెద్ద మలుపు. చాలా స్వర్ణ విక్రయ సంస్థలు ఇండియాలో పెద్ద సంఖ్యలో తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. వాటివల్ల చిన్న వర్తకుల వ్యాపారం తగ్గిపోయింది. కొనుగోలుదారులు సైతం పెద్ద షాపులవైపు అధికంగా ఆకర్షితులవుతున్నారు. 2015-21 మధ్యకాలంలో పెద్ద షాపులు 30శాతం నుంచి 35శాతం దాకా పెరిగాయని ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడించింది. ఫలితంగా బంగారం విక్రయాల్లో చిన్న షాపుల వాటా 50శాతం నుంచి 37శాతానికి పడిపోయింది. ఈ పరిణామాల వల్ల వర్తకుల్లో పోటీతత్వం పెరిగి నాణ్యతతో కూడిన పసిడి విక్రయాలు పెరిగాయి. ప్రజలు ఇటీవల యంత్రాలపై రూపొందించిన ఆభరణాలవైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో 2011-2021 మధ్య కాలంలో చేతితో చేసిన నగల వాటా 65శాతం నుంచి 55శాతానికి తగ్గింది.