తెలంగాణ

telangana

HAIR CARE: శిరోజాల కోసం ఇంట్లోనే దివ్య ఔషధం

By

Published : Aug 3, 2021, 12:00 PM IST

HAIR CARE
జుట్టు సంరక్షణ కోసం

ముఖసౌందర్యాన్ని రెట్టింపు చేసేవి నల్లని కురులే. అయితే చుండ్రు, చిట్లిపోయే చివర్లు శిరోజాలను పేలవంగా మార్చేస్తాయి. ఎన్నిరకాల షాంపూలు వాడినా ఫలితం ఉండదు సరికదా... ఉన్నదీ రాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇంట్లోనే తయారు చేసిన నూనెను వారానికొకసారి పట్టిస్తే పట్టులా మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. మరి ఆ నూనె తయారీ ఎలాగో చూడండి...

తయారీ..

పావు కప్పు మెంతులను గంటసేపు నీళ్లలో నానపెట్టాలి. ఈలోపు గుప్పెడు చొప్పున గోరింటాకు, కరివేపాకు, తులసి ఆకులను శుభ్రం చేసి మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీనికి నానిన మెంతులు, గుప్పెడు చిన్న ఉల్లి పాయలు, రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీజార్‌లో రెండు రెబ్బల కరివేపాకులు, రెండు మందారపూలు, చెంచా మిరియాలు, ఒక కొమ్మ కలబంద ఆకును ముక్కలుగా చేసి మెత్తగా అయ్యాక, మొదట చేసి ఉంచిన మిశ్రమానికి దీన్ని కలపాలి. పొయ్యి వెలిగించి దళసరి గిన్నె పెట్టాలి. అందులో 100 మి.లీ. చొప్పున ఆలివ్‌, కొబ్బరి నూనెలను వేసి వేడిగా అయిన తర్వాత ముందుగా చేసి ఉంచిన మిశ్రమాన్ని కలపాలి. చిన్నగా తరిగి ఉంచుకున్న ఆరు ఉసిరికాయల ముక్కలను కూడా నూనెలో వేసి, పదినిమిషాలు చిన్నమంటపై ఉడకనివ్వాలి. ఆకుపచ్చని వర్ణంలో ఉన్న ఈ నూనెను వడకట్టి అందులో చిటికెడు పచ్చ కర్పూరం కలిపి చల్లారనివ్వాలి. తలకు ఈ నూనెను పట్టించి మర్దనా చేసుకుని ఓ అరగంట ఆరాక తలస్నానం చేస్తే చాలు, మృదువైన మెత్తని జుట్టు మీ సొంతమవుతుంది.

పోషకాలమయం...

ఈ నూనెను ఓ గాజు సీసాలో భద్ర పరుచుకుని, వారానికొకసారి ఉపయోగించుకోవచ్చు. ఇందులో గోరింటాకు చుండ్రును దూరం చేసి మాడును ఆరోగ్యంగా ఉంచి, కురులను మెత్తగా పట్టులా మెరిపించడమే కాదు, జుట్టు ఎదిగేలా చేస్తుంది. కరివేపాకులోని ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మాడుపై ఉండే మృతకణాలు, వ్యర్థాలను తొలగిస్తాయి. తులసిలో ఉండే విటమిన్లు, మినరల్స్‌, ఎలక్ట్రొలైట్స్‌ శిరోజాలకు పోషకాలను అందిస్తాయి. ఈ నూనె తయారీలో కలిపిన మెంతులకు మంచి కండిషనర్‌ గుణం ఉంటుంది. ఉల్లిపాయలు చుండ్రును దూరం చేస్తాయి. కలబందలోని ఏ, సి విటమిన్లు, అలాగే బీ12, ఫోలిక్‌యాసిడ్‌ జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చేసి, అదనపు అందాన్ని తెస్తాయి. అంతేకాదు, జుట్టు రాలడాన్ని నియంత్రించి కాలుష్యం నుంచి కాపాడతాయి.

ఇదీ చూడండి:HAIR LOSS: నుదురు దగ్గర్లో వెంట్రుకలు ఎక్కువగా రాలితే..?

ABOUT THE AUTHOR

...view details