Italy pm resigns: ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి తన పదవికి రాజీనామా చేశారు. ఇటలీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఫోర్జా ఇటాలియా, 5-స్టార్ మూవ్‌మెంట్ విశ్వాస పరీక్షను బహిష్కరించడం వల్ల గురువారం ద్రాగి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు సెర్జియో మట్టరెల్లాకు రాజీనామా లేఖను అందజేశారు. ఆపధర్మ ప్రధానిగా కొనసాగాలని ద్రాగిని అధ్యక్షుడు కోరారు. గత వారమే రాజీనామాను అందజేసినా.. అధ్యక్షుడు సెర్జియో అప్పుడు తిరస్కరించారు.
శాసనసభ పదవీ కాలం, యూరిపియన్ నిధులతో మహమ్మారి పునరుద్ధరణ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కలిసి పనిచేద్దామని ద్రాగి కోరారు. కానీ ఆయన వినతిని భాగస్వామ్య పక్షాలు వినకపోవడం వల్ల 17 నెలల్లోనే ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మారియో ద్రాగి ధన్యవాదాలు తెలిపారు.