అఫ్గాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు (Taliban news today)తమ వశం చేసుకుని దాదాపు వారం రోజులు గడుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటనలు లేవు. మధ్య మధ్యలో చిన్న చిన్న వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప.. పూర్తిస్థాయి వివరాలను బయటపెట్టడం లేదు. అయితే దీనికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది.
ఆగస్టు 31వ తేదీ నాటికి తమ దళాలను పుర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలని అమెరికా(US army Afghanistan news) నిర్ణయించింది. అప్పటివరకు పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని తాలిబన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దళాలు వెనుదిరిగే వరకు ఎలాంటి చర్యలు చేపట్టకూడదని అమెరికా- తాలిబన్ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని.. అఫ్గానిస్థాన్ ప్రస్తుత పరిస్థితులతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. అయితే ఇది కేవలం రాజకీయాలకే పరిమితమా? ఆగస్టు 31 తర్వాత తాలిబన్లు దేశవ్యాప్తంగా మతపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? వంటి ప్రశ్నలకు సమాధానం లేదు.
దీంతో ఆగస్టు 31 తర్వాత ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి:-Afghan Crisis: అతడి కోసం తాలిబన్ల కళ్లుగప్పి అమెరికా రెస్క్యూ ఆపరేషన్
అమెరికా ఆపసోపాలు..!
ఆగస్టు 31 కోసం ఓవైపు తాలిబన్లు ఎదురుచూస్తుంటే.. మరోవైపు అమెరికాకు మాత్రం రోజులు దగ్గరపడుతున్న కొద్దీ కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వాస్తవానికి ఆ తేదీలోగా దళాలను వెనక్కి రప్పించాలన్నది ప్రణాళిక. కానీ తాలిబన్ల ఆక్రమణ అనంతర పరిణామాలతో అగ్రరాజ్య ప్రణాళికలు తలకిందులయ్యాయి. అమెరికన్లను, అమెరికా దళాలను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇప్పుడు అగ్రరాజ్యం ఆపసోపాలు పడుతోంది(US evacuation of Kabul). దీనితో పాటు అఫ్గాన్‌లోని అగ్రరాజ్య మిత్ర దేశాల ప్రజలను కూడా బయటకు తెచ్చే భారం ఆ దేశంపై ఉంది.
ఇప్పటివరకు 5,700మందిని విమానాల ద్వారా దేశాన్ని దాటించింది అమెరికా సైన్యం. వీరిలో 250మంది అమెరికన్లు ఉన్నారు. ఇంకా వేలమందికిపైగా ప్రజలు అఫ్గాన్‌లోనే చిక్కుకున్నారు. అనుకున్న తేదీలోగా మిగిలిన వారిని రక్షించడం, సైన్యాన్ని వెనక్కి రప్పించడం.. ఇప్పుడు అగ్రరాజ్యం ముందున్న అతిపెద్ద సవాలు.