ఈ రోజుల్లో అదనపు ఆదాయం కోసం ఎన్నో కొత్తపుంతలు తొక్కుతున్నారు. రకరకాల మార్గాల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కనిపించిన అన్నింటినీ గుడ్డిగా నమ్మకూడదు. నమ్మి మోసపోకూడదు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఆఫర్లంటూ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. డిసెంబరు 31న దుమ్మురేపాల్సిందేనంటూ ఫోన్లకు వచ్చే సందేశాలు, లింక్‌లు క్లిక్ చేశారా? ఖాతా ఖాళీయే. నయాసాల్ వేడుకల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ‘కొత్త’ ఎత్తుగడలతో చెలరేగే అవకాశం ఉందని నగర సైబర్‌క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ హెచ్చరిస్తున్నారు.
ఒక్క క్లిక్‌తో గుమ్మం వద్దకే..:కొత్త ఏడాది మజాయే వేరు. దీని కోసమే కాచుకున్న కేటుగాళ్లు.. ఫోన్లకు ఎస్ఎమ్ఎస్లు, లింకులు పంపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. డిసెంబరు 31, 2023 జనవరి 1న ఇష్టమైన వారితో గడిపేందుకు అద్భుతమైన అవకాశం అంటూ ఊరిస్తున్నారు. ముందుగా కొంతమేర అడ్వాన్స్ చెల్లిస్తే సీటు రిజర్వ్ చేస్తామంటారు. విదేశీ మద్యం తక్కువ ధరకు ఒక్క క్లిక్‌తో మీ ఇంటి గుమ్మం వద్దకు చేరవేస్తాం. డీజే, అందమైన అమ్మాయిలు, కోరిన ఆహారం.. ‘అన్ లిమిటెడ్ ఆనందం’ నక్షత్రాల హోటళ్లలో ఆతిథ్యం ఇచ్చేందుకు మేము రెడీ అంటూ ఊరిస్తున్నారు. దిల్లీ, ముంబయి నగరాల్లో నయాసాల్ వేడుకలకు రిజర్వేషన్లంటూ ప్రకటించి కొద్దిమందిని మోసగించినట్టు అక్కడ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.