Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 861.25 పాయింట్లు కోల్పోయి.. 57,972.62 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 246 పాయింట్ల నష్టంతో 17,312.90 వద్ద సెషన్‌ను ముగించింది.
లాభపడిన షేర్లు..మారుతీ, నెస్లే, ఎసియన్ పేయింట్స్, ఐటీసీ, ఎమ్ అండ్ ఎమ్, హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు.. టెక్ మహీంద్ర భారీగా నష్టాలను చవిచూసింది. ఈ కంపెనీ షేర్లు 4.57 శాతం మేర పడిపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎస్ టెక్నాలజీస్, టీసీఎస్, కోటక్ మహీంద్ర బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్‌లను నష్టాల్లోకి నెట్టాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వల్ల రోజంతా అదే బాటలో పయనించాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం రెండు శాతానికి చేరే వరకు రేట్ల పెంపు ఉంటుందన్న ఫెడరల్ రిజర్వు ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటన మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం. మరోవైపు రూపాయి బలహీనత, చమురు ధరలు ఎగబాకడం కూడా సూచీలను కలవరపెట్టింది. రిలయన్స్, విప్రో, టీసీఎస్ వంటి దిగ్గజ షేర్లు నష్టపోవడం కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. విదేశీ మదుపరులు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారనే భయం సైతం నష్టాలకు కారణమైంది. ఎక్చేంజీ గణాంకాల ప్రకారం విదేశీ మదుపరులు శుక్రవారం రూ.51.12 కోట్ల పెట్టుబడులు వెనక్కుతీసుకున్నారు.