Tesla in India news : ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలో భారతదేశంలో నూతన ఫ్యాక్టరీ స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టెస్లా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టెస్లా కంపెనీ భారతదేశంలో ఒక తయారీ కేంద్రం పాటు ఇన్నోవేషన్ బేస్, సప్లయిర్ బేస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిసింది. దీని ద్వారా ఇండియా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు అన్ని అవకాశాలను అన్వేషిస్తోంది.
చర్చలు సజావుగా!
టెస్లా కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే భారతదేశ అధికారులతో చర్చలు జరిపారు. టెస్లా కంపెనీ ప్రతినిధులతో తమ చర్చలు సజావుగా సాగాయని, ఆ కంపెనీ భారత మార్కెట్‌పై మంచి ఆసక్తిని కనబరుస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వివిధ అంశాలపై ఆర్థిక మంత్రిత్వశాఖతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించాయి.
షరతులు వర్తిస్తాయి!
టెస్లా కంపెనీ ఇండియాలో ఫ్యాక్టరీ నిర్మించేందుకు.. భారత ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే టెస్లా కంపెనీకి ఇచ్చే ప్రోత్సాహాలు.. కొన్ని నిబంధనలకు లోబడి ఉంటాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
వెండర్ బేస్ కూడా..
ఎలాన్‌మస్క్ నేతృత్వంలోని టెస్లా.. ఇండియాలో అసెంబ్లింగ్ ఫెసిలిటీతో పాటు వెండర్ బేస్ కూడా ఏర్పాటు చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది. ఇప్పటికే చైనా కేంద్రంగా టెస్లా బలమైన మాన్యుఫాక్చురింగ్ బేస్, వెండర్ బేస్‌ను కలిగి ఉంది.
మోదీ అమెరికా పర్యటనకు ముందు..
Modi visit to USA : మే నెలలో భారతదేశానికి వచ్చిన టెస్లా ప్రతినిధులు.. ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. భారతదేశంలో టెస్లా విద్యుత్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు చర్చలు జరిపారు. జూన్ 21న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో టెస్లా ప్రతినిధులు.. మరోసారి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2023 చివరిలోగా భారత్‌కు టెస్లా!
టెస్లా కంపెనీ ఈ 2023 సంవత్సరం చివరినాటికి భారతదేశంలో తమ ఫ్యాక్టరీ స్థాపనకు సరైన ప్రదేశాన్ని ఎంచుకోనుంది. ముఖ్యంగా భారత మార్కెట్‌ను టార్గెట్ చేసుకుని ఇక్కడే టెస్లా కార్లను తయారుచేయనుంది. అలాగే ఇక్కడ తయారైన టెస్లా కార్లు ఎగుమతి చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ ఇంటర్వూలో.. 'ఇప్పటి పరిస్థితుల్లో టెస్లా ప్లాంట్ పెట్టడానికి భారతదేశం సరైన ప్రదేశమేనా?' అని ప్రశ్నించగా.. ఎలాన్ మస్క్ 'కచ్చితంగా' అని సమాధానం ఇవ్వడం గమనార్హం.