ETV Bharat / business

ప్రపంచ కుబేరుడిగా మస్క్​.. మళ్లీ అగ్రస్థానం సొంతం.. మొత్తం సంపద ఎంతంటే!

author img

By

Published : Jun 1, 2023, 1:24 PM IST

Updated : Jun 1, 2023, 2:18 PM IST

Elon Musk Net Worth : ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ అధినేత, ఫ్రెంచ్‌ దేశస్థుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను మస్క్‌ వెనక్కి నె‌ట్టారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొని విలాసవంతమైన వస్తువులకు పెట్టింది పేరైన ఎల్​వీఎమ్​హెచ్​ సంస్థ షేర్‌ పారిస్‌ ట్రేడింగ్‌లో 2.6 శాతం తగ్గింది. ఈ నేపథ్యంలో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద తగ్గి బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో మస్క్‌ పైకి ఎగబాకారు.

Elon Musk Net Worth
ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్

Elon Musk Net Worth : ప్రపంచ కుబేరుల జాబితాలో చాన్నాళ్లు అగ్రస్థానంలో ఉండి ట్విట్టర్‌ కొనుగోలు తదనంతర పరిణామాల తర్వాత కిందకు పడిపోయిన ఎలాన్‌ మస్క్‌ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నారు. ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ తొలిసారి గత డిసెంబరులో మస్క్‌ను దాటేసి మొదటిస్థానానికి చేరారు. ఆ తర్వాత టెక్‌ ఇండస్ట్రీ భారీ ఒడుదొడుకులు ఎదుర్కోవడం, ట్విట్టర్‌ కొనుగోలు తదనంతర పరిణామాల నేపథ్యంలో టెస్లా షేరు విలువ అప్పట్లో భారీగా పతనమైంది. దీంతో మస్క్‌ వ్యక్తిగత సంపద తరిగిపోయింది. అదే సమయంలో కరోనా పరిస్థితులు చక్కబడి విలాసవంత వస్తువుల కొనుగోళ్లు పుంజుకొన్నాయి. ఫలితంగా ఎల్​వీఎమ్​హెచ్ షేర్లు రాణించాయి. అదే బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ అగ్రస్థానానికి రావడానికి కారణమైంది. తిరిగి ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు బలపడడం వల్ల మళ్లీ లగ్జరీ వస్తువుల తయారీ సంస్థల షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి.

విలాసవంత వస్తువులకు పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు ఏప్రిల్‌ నుంచి 10 శాతానికి పైగా తగ్గాయి. ఓ దశలో ఒక్కరోజులోనే ఆర్నాల్ట్‌ సంపదలో 11 బిలియన్‌ డాలర్లు ఆవిరయ్యాయి. మస్క్‌ సంపద మాత్రం ఈ ఏడాది పెరుగుతూ పోతోంది. ట్విట్టర్‌ కొనుగోలు పరిణామాల నేపథ్యంలో కుంగిన టెస్లా షేర్లు కనిష్ఠాల నుంచి పుంజుకోవడమే ఇందుకు కారణం. మస్క్‌ వ్యక్తిగత సంపదలో 71 శాతం వాటా టెస్లా షేర్లదే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు టెస్లా షేర్లు 66 శాతం పుంజుకున్నాయి. దీంతో మస్క్‌ సంపద 55.3 బిలియన్‌ డాలర్లు పెరిగి ప్రస్తుతం 192.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో ఆర్నాల్ట్‌ సంపద 186.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Elon Musk Reclaims Top Place : ఈ ఏడాది ఏప్రిల్​లో బిలియనీర్ ఎలాన్ మస్క్ భారీగా నష్టపోయారు. టెస్లా అమ్మకాలు మందగించడం, స్పేస్ఎక్స్ రాకెట్ పేలిపోవడం, ట్విట్టర్ బ్లూటిక్ వైఫల్యాలు వంటి వరుస నిరాశాజనక పరిణామాల మధ్య ఆయన కంపెనీల షేర్లు భారీ కుదుపునకు గురయ్యాయి. దీంతో ఈ ఏడాదిలో ఆయన ఏప్రిల్​లోనే అత్యధిక సంపద కోల్పోయారు. ఫలితంగా మస్క్​ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానం నుంచి, రెండో స్థానానికి పడిపోయారు. అప్పటి నుంటి ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ 'లూయీ విటాన్' అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్ట్ ఫస్ట్​ ప్లేస్​లో ఉండగా.. ప్రస్తుతం మస్క్​ టాప్​లోకి దూసుకొచ్చారు.

నెలన్నర వ్యవధిలోనే..
ఏప్రిల్​లో మస్క్ సంపద 164 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో రెండో స్థానంలో కొనసాగుతూ వచ్చిన ఆయన గురువారం (జూన్ 1) 186.6 బిలియన్ డాలర్లతో మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. అంటే నెలన్నర వ్యవధిలో మస్క్ సంపద 22.6 బిలియన్ డాలర్లు పెరిగింది.

Last Updated : Jun 1, 2023, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.