కరోనా వల్ల గత సంవత్సరం ఆర్థిక పరిస్థితి దెబ్బతినటం, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేయడం వంటి కారణాలతో సురక్షిత పెట్టుబడి సాధనం అయిన బంగారం ధర అమాంతం పెరిగింది. ఆగస్టులో పది గ్రాముల బంగారం ధర జీవనకాల గరిష్ఠ స్థాయికి (రూ. 57వేలకు) చేరింది. అయితే ఆ తర్వాత నుంచి ధర తగ్గుతూ వచ్చింది. భారత్ సహా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు మెరుగవటం సహా ఈక్విటీ మార్కెట్లు మంచి రాబడులను ఇవ్వడం వల్ల బంగారంపై పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపారు మదుపరులు.
ఈ నెల ప్రారంభం నుంచి బంగారం ధర మరోసారి పెరుగుతూ వస్తోంది. మార్చి 31 గణాంకాల ప్రకారం.. హైదరాబాద్లో తులం (10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి) బంగారం ధర రూ.45,500 వద్ద ఉండేది. ఇప్పుడు దాదాపు రూ.48వేల స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశాలున్నాయని పసిడిపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. అందుకు ఇది సరైన సమయమేనని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు ఇది సరైన సమయం?
సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం అన్ని దేశాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనితో కొన్ని దేశాలు, దేశలోని పలు నగరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేందుకు కారణం కావచ్చనే అంచనాలున్నాయి.
చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికా, భారీ ఉపశమన ప్యాకేజీ ప్రకటించాయి. దీని వల్ల ప్రజల చేతిలో డబ్బు ఉంది. ఫలితంగా.. వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. సాధారణంగా ధరల పెరుగుదల ఉన్నప్పుడు బంగారం కూడా ప్రియమవుతుంది.
కరోనా కేసులు పెరగటం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగొచ్చనే అంచనాల నేపథ్యంలో.. బంగారం ధర మరింత పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి పెట్టుబడుల కోసం, ఆభరణాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు సరైన సమయమని విశ్లేషకులు చెబుతున్నారు.