Punjab New CM: పంజాబ్ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరునాడే భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు తన వ్యక్తిగత నంబర్‌నే ప్రజలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భగత్ సింగ్ వర్ధంతి రోజు మార్చి 23న అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్ కింద.. తన వాట్సప్ నెంబర్‌ను విడుదల చేస్తానని భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఎవరైనా లంచం అడిగితే దాని వీడియో లేదా ఆడియోను రికార్డు చేసి తనకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లో ఇకపై ఎవరూ అవినీతికి పాల్పడవద్దని హెచ్చరించారు.
" దిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చాక అవినీతి అధికారుల వీడియోలు పంపాలని ప్రజలను అడిగింది. అదే దిల్లీలో అవినీతి అంతానికి దారితీసింది. రానున్న రోజుల్లో నా వ్యక్తిగత వాట్సాప్ నంబర్‌తోనే అలాంటి హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ఎవరైనా లంచం అడిగితే నిరాకరించకుండా.. వీడియో లేదా ఆడియో రికార్డ్ చేసి ఆ నంబర్‌కు పంపాలి. మా అధికారులు దానిని పరిశీలించి చర్యలు తీసుకుంటారని హామీ ఇస్తున్నా. ఏ ఒక్క అవినీతి అధికారి తప్పించుకోలేడు. ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను మార్చి 23న విడుదల చేస్తాం. "
- భగవంత్ మాన్, పంజాబ్ ముఖ్యమంత్రి.