PM Modi Ayodhya Visit : ఆధునిక హంగులతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌తో పాటు మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటు చేసిన 'జన్ సభ'లో మోదీ పాల్గొన్నారు.
శనివారం ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం జరిగిన ఈ రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం
అనంతరం రోడ్‌షో ద్వాారా అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వెంట రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం యోగి అదిత్యనాథ్ ఉన్నారు. రైల్వేస్టేషన్ వివరాలను ప్రధానికి కేంద్ర మంత్రి వివరించారు. ఇక్కడి నుంచే రెండు అమృత్ రైళ్లు, ఆరు వందే భారత్ రైళ్లకు కూడా పచ్చ జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. అనంతరం రైలు లోపలకు వెళ్లి చిన్నారులతో ముచ్చటించారు.
అయోధ్య రైల్వేస్టేషన్ ముఖద్వారంపై మకుటం, గోడలపై విల్లు తరహా నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. స్టేషన్ నిర్మాణానికి కాంక్రీటుతో పాటు సున్నపురాయితో చేసిన పిల్లర్లు ఉపయోగించారు. ఇవి స్టేషన్‌కు సంప్రదాయ శోభను ఇస్తున్నాయి. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించారు. 240 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన మూడు అంతస్తుల ఈ ఆధునిక రైల్వే స్టేషన్ భవనంలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజ అవసరాల కోసం దుకాణాలు వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.