Rajya Sabha Derek OBrien Suspended : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సస్పెన్షన్‌పై రాజ్యసభలో హైడ్రామా నడిచింది. సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తొలుత ప్రకటించిన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్.. తన నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉందని తర్వాత వివరణ ఇచ్చారు. డెరెక్‌పై సస్పెన్షన్ విధించే ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. సస్పెన్షన్ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించలేదు కాబట్టి.. సభలో డెరెక్ కొనసాగవచ్చని పేర్కొన్నారు.
Derek O Brien parliament : అంతకుముందు.. అనుచిత ప్రవర్తన కారణంగా డెరెక్ ఓబ్రియెన్‌పై సస్పెన్షన్ వేస్తున్నట్లు జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. దిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా ఓబ్రియెన్ తీరుపై ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ఆయన సభలో నాటకీయంగా వ్యవహరిస్తున్నారని ధన్‌ఖడ్ మండిపడ్డారు. ఓబ్రియెన్ ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారు.
ఈ క్రమంలోనే ఓబ్రియెన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం సహా ఛైర్మన్‌ను అగౌరవపరుస్తున్నారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం.. ఓబ్రియెన్‌ను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ మళ్లీ సమావేశం కాగా.. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి సహా పలువురు సభ్యులు.. డెరెక్ విషయంలో ఛైర్మన్ కనికరం చూపించాలని కోరారు. దీనికి స్పందించిన ఛైర్మన్ ధన్‌ఖడ్.. సస్పెన్షన్ ప్రక్రియ పూర్తై ఉంటే.. డెరెక్ సభలోకి వచ్చేవారు కాదని వ్యాఖ్యానించారు.
"డెరెక్‌పై నేనెందుకు కనికరం చూపించాలి. ఈ సమావేశాల నుంచి డెరెక్ సస్పెండ్ అయితే.. ఇంకోసారి సభలో అడుగుపెట్టేవారా? ఏ సభ్యుడిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చినా అది నాకు బాధ కలిగించే విషయమే. నేను నా బాధను అణచుకుంటున్నా. మిగిలిన సభ్యులు ఎవరూ అలా చేయడం లేదు. సస్పెన్షన్ తీర్మానం పాసై ఉంటే డెరెక్ మళ్లీ సభలో అడుగుపెట్టేవారు కాదు. తీర్మానం పూర్తి కాలేదు కాబట్టి ఆయనకు మళ్లీ సభలోకి అనుమతి లభించింది. సాధ్యమైనంత వరకు సభ నడిచేలా చూడటమే నా విధి. డెరెక్ ఎప్పుడు నా ఛాంబర్‌కు వచ్చి మాట్లాడినా.. నేను ఈ విషయంపై విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా" అని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో కల్పించుకున్న డెరెక్ ఓబ్రియన్.. మంగళవారం ఉదయం 11 నుంచి 12 మధ్య ధన్‌ఖడ్ ఛాంబర్‌కు తాను వెళ్లనేలేదని అన్నారు. దీనికి స్పందించిన ధన్‌ఖడ్.. ఇలాంటి వ్యవహారశైలిని మీరు ఆమోదిస్తారా అంటూ సభ్యులను ప్రశ్నించారు. కాగా, కొద్ది రోజుల క్రితం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ కుమార్ సింగ్‌పై కూడా వేటు పడింది.
'ఛైర్మన్ హెచ్చరించినా తీరు మారలేదు'
టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ సస్పెండ్‌పై బీజేపీ నేత, ఎంపీ మహేశ్ జెఠ్మలానీ స్పందించారు. 'డెరెక్ ఓబ్రియెన్ రాజ్యసభలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఆయన్ను ఛైర్మన్ పలుసార్లు హెచ్చరించినా తీరు మారలేదు. అందుకే ఛైర్మన్ ఆయనను సస్పెండ్ చేశారు' అని తెలిపారు.
రాజ్యసభలో దిల్లీ ఆర్డినెన్స్ ఆమోదం..
Delhi Bill Passed In Parliament : విపక్షాల అభ్యంతరాల మధ్యే 'దిల్లీ' బిల్లుకు పార్లమెంట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టిన 'దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు'పై చర్చ అనంతరం.. పెద్దల సభ పచ్చజెండా ఊపింది. దిల్లీ సర్వీసుల బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. సాంకేతిక సమస్య నేపథ్యంలో.. ఓటింగ్‌ను స్లిప్పుల ద్వారా నిర్వహించారు. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ బిల్లు చట్టంగా మారనుంది.