తెలంగాణ

telangana

ఉదయ్‌ను విచారిస్తే మరికొంత మంది పాత్ర బయటపడుతుంది..కస్టడీ పిటిషన్‌లో సీబీఐ

By

Published : Apr 17, 2023, 9:02 AM IST

Updated : Apr 17, 2023, 10:23 AM IST

YS Vivekananda
YS Vivekananda

08:59 April 17

హత్యలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్న సీబీఐ

YS Vivekananda Reddy murder case News: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దర్యాప్తులో దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ నెల 30 తేదీ వరకు వివేకా హత్య కేసు విచారణను పూర్తి చేస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)కు తెలిపిన సీబీఐ.. మూడు రోజులక్రితం హత్య కేసుతో సంబంధమున్న నిందితుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని కడపలో అరెస్ట్ చేసింది. అనంతరం హైదరాబాద్‌లో న్యాయమూర్తి ఎదుట అతడిని హాజరుపర్చింది. దీంతో సీబీఐ కోర్టు జడ్జి ఉదయ్ కుమార్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌‌ను విధించగా.. సీబీఐ అధికారులు ఉదయ్‌ కుమార్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత నిందితుడి కస్టడీని కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలాలు చేసింది.

ఈ క్రమంలో తాజాగా వివేకా హత్య కేసులో కుట్రదారుడిగా వైఎస్ భాస్కర్‌ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయన్న సీబీఐ.. ఆదివారం రోజున ఆయనను పులివెందులలో అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తరలించింది. అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి.. సీబీఐ జడ్జి ముందు హాజరుపర్చగా.. భాస్కర్ రెడ్డికి 14 రోజులు (ఈనెల 29 వరకు) రిమాండ్ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ కూడా సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో ఉదయ్ కుమార్ కస్టడీ పిటిషన్‌పై, వైఎస్ భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌లపై ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ కస్టడీ పిటిషన్‌పై 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఉదయ్ కుమార్ రెడ్డి కీలకపాత్ర పోషించాడని కస్టడీ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. సాక్ష్యాలను తారుమారు చేయడంలో కూడా ఉదయ్ కీలకపాత్ర పోషించాడన్న సీబీఐ.. గూగుల్ లొకేషన్ ఆధారంగా అవినాష్ రెడ్డి ఇంట్లో ఉదయ్‌ కుమార్ రెడ్డిని గుర్తించామని తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి ఉదయ్‌ కుమార్ రెడ్డిని విచారిస్తే మరికొంత మంది పాత్ర బయటపడుతుందని సీబీఐ వివరించింది.

మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై కూడా నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. భాస్కర్‌ రెడ్డిని 10 రోజుల కస్టడీకి కోరుతూ.. సీబీఐ ఆదివారం నాడు పిటిషన్ వేసింది. నిన్న భాస్కర్ రెడ్డిని పులివెందులలో అరెస్టు చేసి.. సీబీఐ కోర్టులో హజరుపర్చగా.. భాస్కర్‌ రెడ్డికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వివేకా హత్యలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్న సీబీఐ.. కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న తెలిపింది. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టులో వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిల కస్టడీ పిటిషన్ల విచారణపై ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి

Last Updated :Apr 17, 2023, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details