Monthly Assistance Scheme for Women in Tamilnadu : మహిళలకు నెలకు వెయ్యి రూపాయల సాయం అందించే పథకాన్ని ప్రారంభించింది తమిళనాడు ప్రభుత్వం. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ ఐకాన్, దివంగత నేత సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించారు తమిళనాడు సీఎం ఎమ్కే స్టాలిన్. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం' పేరుతో.. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఈ సాయాన్ని అందించనుంది డీఎమ్‌కే ప్రభుత్వం.
కాంచీపురం జిల్లాలో అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు స్టాలిన్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. అన్నాదురై జయంతి రోజున, కరుణానిధి శతజయంతి తరుణంలో ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వ కారణమన్నారు. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం'.. విప్లవాత్మకమైనదని ఆయన అభివర్ణించారు. ఇది రాష్ట్ర మహిళల జీవితాల్లో పునరుజ్జీవనానికి దారి తీస్తుందని వివరించారు.
"ఇంటి పెద్ద అయిన మహిళకు సంవత్సరానికి రూ.12వేలు ఇస్తున్నాం. ఈ పథకం వారికి ఎంతో భరోసాను ఇస్తుంది. ఇది అభివృద్ధికి చిహ్నం. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం' మహిళల జీవన ప్రమాణాలను పెంచుతుంది. వారిని ఆత్మగౌరవంతో బతికేలా చేస్తుంది. పేదరికాన్ని రూపు మాపుతుంది." అని స్టాలిన్ పేర్కొన్నారు.