Delhi Air Pollution Today :దేశ రాజధాని దిల్లీలో మళ్లీ వాయు కాలుష్య తీవ్రత ప్రమాదస్థాయికి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత 'తీవ్రస్థాయి'కి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు గణాంకాల ప్రకారం గాలి నాణ్యత సూచీ 346గా నమోదైంది. లోధీ రోడ్, జహంగీర్‌పురి, ఆర్కేపురం, ఐజీఐ ఎయిర్ పోర్టు టీ3 వద్ద పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో వరుసగా 438, 491, 486, 463గా వాయు నాణ్యత నమోదైంది.
Delhi Air Quality : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 62, సెక్టార్ 1, సెక్టార్ 116 వద్ద గాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అనవసరమైన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో ఐదు రోజుల పాటు నిర్మాణ పనులు చేపట్టకూడదని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్ సిగ్నల్ పడగానే వాహన ఇంజిన్ ఆపేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతోపాటు 1,000 సీఎన్‌జీ ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా దిల్లీలో శుక్రవారం ప్రాథమిక పాఠశాలలకు కేజ్రీవాల్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లోధీ రోడ్డులో చెట్లపై దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నీటిని చల్లుతోంది.
'బయటకు వెళ్తే చాలు!'
దిల్లీ వాయుకాలుష్యంపై శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ సందీప్ నాయర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజధానిలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఉన్నట్లు చెప్పారు. ఆస్పత్రుల్లో 20-30 శాతం ఓపీ పెరిగిందని తెలిపారు. బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరిలో కళ్ల ఇన్ఫెక్షన్, గొంతులో నొప్పి వస్తున్నట్లు పేర్కొన్నారు. శరీరంలోకి విషపూరితమైన గాలి వెళ్లినప్పుడు.. ఆ ప్రభావం ప్రతి అవయవం మీద పడుతుందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.