తెలంగాణ

telangana

పెద్దలసభకు 41 మంది ఏకగ్రీవం.. జాబితాలో చిదంబరం, సిబల్​

By

Published : Jun 4, 2022, 7:22 AM IST

Rajya Sabha Polls: రాజ్యసభకు వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 41 మంది ఏకగ్రీవమయ్యారు. జూన్​ 10న మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో పోటీలేని 41 స్థానాల్లోని అభ్యర్థులను రిటర్నింగ్​ అధికారులు ప్రకటించారు. వారిలో కాంగ్రెస్‌ నుంచి పి.చిదంబరం, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్‌ మాజీ నేత కపిల్‌ సిబల్‌ తదితరులు ఉన్నారు.

Rajya Sabha Polls
Rajya Sabha Polls

Rajya Sabha Polls: దేశవ్యాప్తంగా త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. మొత్తంగా 41మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. 15 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేయగా.. పలు పార్టీలకు చెందిన 41 మంది ఎలాంటి పోటీ లేకుండా పెద్దల సభకు ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి పి.చిదంబరం, రాజీవ్‌ శుక్లా, భాజపా నుంచి సుమిత్ర వాల్మీకి, కవితా పాటిదార్‌, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్‌ మాజీ నేత కపిల్‌ సిబల్‌, ఆర్జేడీకి చెందిన మిసా భారతి, ఆర్‌ఎల్డీ నుంచి జయంత్‌ చౌదరీ తదితరులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొత్తం ఆరు స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు సీట్లలో ఎన్నికల్లో అధికార పార్టీలు వైకాపా, తెరాసకు తగిన సంఖ్యా బలం ఉండటం వల్ల ఎలాంటి పోటీ లేకుండానే ఆ స్థానాలను కైవసం చేసుకున్నాయి.

యూపీలో 11కు 11 స్థానాలూ ఏకగ్రీవం కాగా.. తమిళనాడులో ఆరు, బిహార్‌లో 5, ఏపీలో 4, మధ్యప్రదేశ్‌, ఒడిశాలలో చెరో మూడు స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, తెలంగాణ, ఝార్ఖండ్‌ రెండు, ఉత్తరాఖండ్‌లో చెరో స్థానం చొప్పున ఎలాంటి పోటీ లేకుండానే ఆయా పార్టీలకు చెందిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ 41మంది విజేతల్లో పార్టీల వారీగా చూస్తే.. భాజపా నుంచి 14 మంది ఉండగా.. కాంగ్రెస్‌, వైకాపా నుంచి నలుగురు చొప్పున డీఎంకే, బీజేడీ నుంచి ముగ్గురేసి.. ఆప్‌, ఆర్జేడీ, తెరాస, అన్నాడీఎంకే నుంచి ఇద్దరు చొప్పున ఎన్నిక కాగా.. జేఎంఎం, జేడీయూ, ఎస్పీ, ఆర్‌ఎల్డీ నుంచి ఒక్కొక్కరు, కపిల్‌ సిబల్‌ స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. ఇంకా మహారాష్ట్రలో ఆరు, రాజస్థాన్‌, కర్ణాటకలలో నాలుగేసి చొప్పున, హరియాణాలో రెండు స్థానాలకు జూన్‌ 10న ఎన్నికలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details