రాజస్థాన్‌లో రాజకీయ కలకలం రేపిన ఆడియో టేపుల వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరమైంది. టేపుల విషయంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్‌ఓజీ) పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని, విచారణ కోసం తన గొంతుతో సాంపిల్ ఆడియో క్లిప్ రికార్డు చేసి పంపాలని వాటిలో పేర్కొన్నారు.
అశోక్ గహ్లోత్ సర్కారును కూల్చివేయడానికి శాసనసభ్యులను ప్రలోభపెట్టే సంభాషణలుగా చెబుతున్న ఆడియో టేపులపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఓజీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. గజేంద్ర షెకావత్‌తో పాటు కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్న సంజయ్ జైన్ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.