మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ 10 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించడమే ఇందుకు కారణం. ఈనెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..
భోపాల్‌లోని ఆదంపుర్కు చెందిన బాలిక అనారోగ్యానికి గురైంది. ఈనెల 11న అక్కడే ఉన్న ఎయిమ్స్‌లో చేరింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించాలని సూచించారు. ఈ క్రమంలో ఎయిమ్స్ బ్లడ్ బ్యాంక్ నుంచి డొనేట్ చేసిన బ్లడ్‌ను తెచ్చిన వైద్యులు ఆమెకు ఎక్కించారు. అయితే రక్తం శరీరంలోకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. బాలిక మృతికి కారణం తెలుసుకునేందుకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఇచ్చిన రక్తంలో హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది.
సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బ్లడ్ శాంపిల్ మార్చేందుకు ప్రయత్నించారని బాలిక తండ్రి ఆరోపించారు. దీనిపై ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేసిన బాధిత కుటుంబీకులు.. ఈ విషయంపై ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి :బ్యాటరీ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి