ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంతర్రాష్ట్ర వజ్రాలు.. ఎర్ర చందనం దొంగల అరెస్టు.. ఎక్కడంటే..

By

Published : Mar 21, 2023, 2:16 PM IST

Interstate Robbers in Kadapa : వజ్రాలను విక్రయించి నగదు అందించమని కోరినందుకు.. దాడి చేసి వజ్రాలతో ఉడాయించిన అంతర్రాష్ట్ర దొంగలను.. అక్రమంగా ఎర్రచందనం చెట్లను నరికి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్న ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వజ్రాలతో ఉడాయించిన వ్యక్తులను గోవాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Interstate Robbers Arrested
వజ్రాలు.. ఎర్ర చందనం దొంగల అరెస్టు

Interstate Robbers Arrested : కడప జిల్లా పోలీసులు రెండు వేరు వేరు ప్రాంతాలలో అంతర్రాష్ట్ర దొంగలను, ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి లక్షల రూపాయలు విలువచేసే వజ్రాలను, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచారు. వజ్రాలను స్వాధీనం చేసుకున్న కేసు దాదాపు రెండు సంవత్సరాల క్రితం నమోదయ్యిందని.. ఆ నిందితుడు గోవాలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

అమ్మి పెట్టమన్నందుకు ఎత్తుకెళ్లారు : కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరంలో వజ్రాల దొంగతనం జరిగింది. ఈ కేసులో ప్రధాన సుత్రధారుడ్ని అరెస్టు చేసి అతని నుంచి 53 లక్షల రూపాయల విలువ చేసే మూడు చిన్న వజ్రాలను, ఒక కనక పుష్యరాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపలోని అల్మాస్ పేటకు చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తి, గోవాకు చెందిన ఇస్మాయిల్ షాహిద్ అనే వజ్రాల వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. తన దగ్గర 9 వజ్రాలు ఉన్నాయని వాటిని విక్రయించి నగదు ఇవ్వాలని.. కడపకు చెందిన ఖాదర్ బాషా.. వజ్రాల వ్యాపారిని కోరాడు.

వజ్రాలను తీసుకుని వచ్చి నేరుగా చూపిస్తే విక్రయించి నగదు చెల్లిస్తానని వజ్రాల వ్యాపారి తెలిపాడు. ఈ క్రమంలో 2020 జనవరి 16వ తేదీన కడపకు చెందిన ఖాదర్ బాషా తన వద్ద ఉన్న వజ్రాలను తీసుకుని.. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీకి వెళ్లాడు. అక్కడికి ఇస్మాయిల్ షాహిద్ మరి కొంతమంది వజ్రాల వ్యాపారులను తీసుకుని వచ్చాడు. ఖాదర్ బాషా తన వద్ద ఉన్న వజ్రాలను చూపిస్తున్న క్రమంలో ఇస్మాయిల్ షాహిద్ తన అనుచరులతో కలిసి బాషాపై దాడి చేశాడు.

దాడి అనంతరం అతని వద్ద నుంచి 9 వజ్రాలను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఖాదర్​ బాషా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రిమ్స్​ నుంచి పోలీసులు గోవాకు వెళ్లి ఇస్మాయిల్ షాహిద్ కోసం గాలించగా పట్టబడ్డాడు. దీంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 53 లక్షలు ఉంటుందని తెలిపారు.

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు : ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరికి దుంగలను తరలిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ గండి శివారు ప్రాంతాలలో అక్రమంగా ఎర్రచందనం చెట్లను నరికి.. దుంగలను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న స్మగ్లర్లకు విక్రయించి కాసులు చేసుకుంటున్నారు.

పోలీసులకు ఈ విషయం తెలియటంతో.. ఎర్రచందనం స్మగ్లర్ల పై నిఘా ఉంచారు. ఈ క్రమంలో అక్రమంగా రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు దుండగులను అరెస్టు చేశారు. వారి నుంచి 11 ఎర్రచందనం దుంగలు, ఐదు సెల్ ఫోన్లు, రెండు గొడ్డళ్లను స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. స్మగ్లర్లపై కడప జిల్లా పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు గురవుతున్నట్లు కనపడితే సమాచారం అందించాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​ సూచించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details