ETV Bharat / state

క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి నిర్లక్ష్యపు జబ్బు.. నాలుగేళ్లైనా నిర్మించని వైనం

author img

By

Published : Mar 21, 2023, 10:17 AM IST

STATE CANCER INSTITUTE : కర్నూలుకు హైకోర్టు వల్ల పేదలకు ఏం మేలు జరుగుతుందో ఏమో గానీ.. ఆ ఆస్పత్రి నిర్మాణం పూర్తైతే మాత్రం.. ఖర్చులేకుండా ఖరీదైన క్యాన్సర్‌ వైద్యం అందుతుంది. రోగులు హైదరాబాద్‌కో, బెంగళూరుకో వెళ్లాల్సిన బాధతప్పుతుంది. కానీ ఆ సంకల్పానికి.. నిర్లక్ష్యపు జబ్బు అంటుకుంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం.. నేటికీ పూర్తికాలేదు. 13 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు.. నాలుగేళ్లవుతున్నా కొలిక్కిరాలేదు.

STATE CANCER INSTITUTE
STATE CANCER INSTITUTE

క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి నిర్లక్ష్యపు జబ్బు.. నాలుగేళ్లైనా నిర్మించని వైనం

STATE CANCER INSTITUTE : క్యాన్సర్‌ వైద్యం ఖర్చుతో కూడుకున్నది. అలాంటి ఖరీదైన వైద్యాన్నిపేదలకు అందుబాటులోకి తేవాలని.. ప్రత్యేకించి రాయలసీమలో అధునాతన సౌకర్యాలతో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మించాలని.. గత తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే కర్నూలులో.. స్టేట్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. దీని కోసం కర్నూలు మెడికల్ కళాశాల ఆవరణలోనే తొమ్మిదిన్నర ఎకరాల స్థలం కేటాయించింది. 120 కోట్ల రూపాయల వ్యయంతో.. 200 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు 2019 జనవరి 8న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 13 నెలల్లో పనులు పూర్తి కావాలని నిర్దేశించారు. ఇప్పుడు చూస్తే.. ఇంకో 13 నెలలకైనా ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందా అనేది సందేహమే.

కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్‌ ఏర్పాటుకు.. మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం 54 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు కేటాయించాయి. 2020 నాటికి ఆసుపత్రి నిర్మాణం... పూర్తి చేయాల్సి ఉంది. కానీ 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారం చేపట్టాక పనులు మందగించాయి. మొదట్లో ఇసుక అందుబాటులో లేకపోవటం, సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో భవనం ఇలా అసంపూర్తిగానే మిగిలిపోయింది. ప్రస్తుతం 3 కోట్ల రూపాయల పనులకు సంబంధించి బిల్లులు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గుత్తేదారు పనులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

"2020 కల్లా ఆసుపత్రి పనులు పూర్తి చేయాలని నిధులు మంజూరు అయినప్పటికీ ఇప్పటికి కూడా పనులు పూర్తి కాలేదు. చాలా మంది పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు" ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి రోగులను ఆదుకోవాలి-శ్రీనివాసులు, కర్నూలు

క్యాన్సర్ ఆస్పత్రికి 84 కోట్ల రూపాయల విలువైన పరికరాలు తీసుకురావాల్సి ఉంది. అవి అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆలస్యమవుతోందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకే.. జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతి సంవత్సరం కర్నూలులోని.. ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు 10 వేల మందికి పైగా క్యాన్సర్ రోగులు చికిత్స చేయించుకున్నట్లు.. నివేదికలు చెప్తున్నాయి. వీరి కోసం ఆరోగ్య శ్రీ ద్వారా గత రెండు సంవత్సరాలలో.. 40 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి పూర్తై ఉంటే ఈ డబ్బు ఆదా అయ్యేది. రోగులకూ.. ప్రయాస తప్పేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్టేట్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్‌ను త్వరితగతిన పూర్తి చేసి.. అందుబాటులోకి తేవాలని రోగులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.