ఆంధ్రప్రదేశ్

andhra pradesh

16 మంది ముఖ్యమంత్రులు చేయని అప్పు.. సీఎం జగన్ చేశారు: తులసి రెడ్డి

By

Published : Apr 4, 2023, 2:10 PM IST

Tulasi Reddy fire on CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని అప్పులతోనే ఆరంభించిందని.. కాంగ్రెస్ పార్టీ పీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 1956 నుంచి 2014 వరకు దాదాపు 58 సంవత్సరాలల్లో 16 మంది ముఖ్యమంత్రులు చేయని అప్పు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేశారంటూ దుయ్యబట్టారు. ఆ అప్పుల వివరాలను తులసి రెడ్డి వివరించారు.

Tulasi Reddy
Tulasi Reddy

అప్పులతోనే వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరాన్ని ఆరంభించింది..

Tulasi Reddy fire on CM Jagan Mohan Reddy: అప్పులతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరాన్ని ఆరంభించటం శోచనీయమని..కాంగ్రెస్ పార్టీ పీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లెలోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పలు కీలక విషయాలను వెల్లడిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై తీవ్రంగా మండిపడ్డారు. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి పనిదినం రోజైన ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు వద్ద 2000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులతోనే ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించటం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఈ 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తారీఖున సెలవు. ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం కాబట్టి సెలవు. ఏప్రిల్ 3వ తేదీన అంటే పని దినాలు ప్రారంభమైన రోజునే వైకాపా (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ప్రభుత్వం రిజర్వు బ్యాంకు దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి పనిదినం రోజున అప్పు చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది. ఈరోజుకి దాదాపు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఆ పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో 1956 నుంచి 2014వరకు 58 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రుల పాలన కాలాల్లో అయిన అప్పు..లక్ష కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019వరకు అంటే 5 సంవత్సరాల కాలంలో అయిన అప్పు.. లక్షన్నర కోట్ల రూపాయలు. అయితే, 2019 నుంచి ఇప్పటివరకూ అంటే నాలుగు సంవత్సరాల్లో వైకాపా చేసిన అదనపు అప్పు.. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు. మొత్తం పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే.. అందులో జగన్ ప్రభుత్వం చేసిన అప్పే.. ఏడున్నర కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇంత అప్పు చేసినా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదు. ఇది వైకాపా పరిస్థితి'' అని ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి శ్రీలంక కంటే అధ్వానంగా ఉందని తులసి రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షను పాటించాలని డిమాండ్ చేశారు. అనవసరమైన అప్పులు చేసి రాష్ట్రాన్ని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అప్పులు చేసినా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తులసి రెడ్డి హెచ్చరించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details