ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉప్పొంగుతున్న నదులు..వంతెన లేక ప్రజలకు తప్పని ఇబ్బందులు

By

Published : Sep 25, 2020, 2:13 PM IST

వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగితే ప్రజల ఆనందానికి అవధులుండవు. విజయనగరం జిలాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వాగులు, వంకలు పొంగితే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. వంతెనలు లేక బాహ్య ప్రపంచానికి రాలేకపోతున్న ప్రజల అవస్థలపై ప్రత్యేక కథనం.

Construction of the Vegavathi bridge has stopped in vizianagaram
దయనీయంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితి

విజయనగరం జిల్లాలో నాగావళి, స్వర్ణముఖి, చంపావతి, గోస్తనీ ప్రధాన నదులు. వీటిలో చంపావతి, గోస్తనీ మినహా...మిగిలినవి ఒడిశా నుంచి జిల్లా మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవే స్థానిక ప్రజలకు ప్రధాన సాగు, తాగునీటీ వనరులు. వీటికి అనుబంధంగా వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వీటిపై ఏళ్ల తరబడి వంతెనలు నిర్మించకపోవడం ప్రజలకు శాపంగా మారింది. నదీ ప్రవాహాలు తగ్గే వరకు వారంతా బాహ్య ప్రపంచానికి దూరంగా గడపాల్సిన దుస్థితి ఉంది. సాలూరు మండలం శివరామపురం వద్ద వేగావతి పరివాహక పరిధిలోని 15 గ్రామాల ప్రజలు వర్షాకాలం 3 నెలలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రహదారి, వంతెన సదుపాయం లేక.. నది పొంగినప్పుడల్లా జల దిగ్బంధంలోనే గడుపుతున్నారు.

అర్ధాంతరంగా ఆగిపోయిన వంతెన నిర్మాణం

వేగావతిపై శివరాంపురం వద్ద వంతెన కోసం 2010 నవంబరులో శంకుస్థాపన చేశారు. 2011లో పనులు ప్రారంభమయ్యాయి. తమ కష్టాలు తీరుతాయని ప్రజలంతా సంతోషించారు. కానీ వంతెన నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. పునాదులకే పరిమితమైంది. 15గ్రామాల ప్రజలకు కష్టాలు మళ్లీ మొదటి కొచ్చాయి. వరదల సమయంలోనూ నిత్యావసరాల కోసం నదిని దాటాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని బాధిత ప్రజలంటున్నారు. అసంపూర్తిగా ఉన్న వంతెనను త్వరగా పూర్తి చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఇదీ చదవండి:కళ్లెదుటే జలసిరి.. ఒడిసిపట్టక చేజారి!

ABOUT THE AUTHOR

...view details