ETV Bharat / city

కళ్లెదుటే జలసిరి.. ఒడిసిపట్టక చేజారి!

author img

By

Published : Sep 25, 2020, 12:19 PM IST

కళ్ల ముందే జలసిరి చేజారిపోతోంది. కట్టడి చేసే మార్గం లేకుండాపోతోంది. కరవు సీమ నుంచి జలధార రయ్‌మంటూ దిగువకు వెళ్లిపోతోంది. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకునేందుకు కోట్ల రూపాయల నిధులు ధారపోస్తున్నారు. కానీ అత్యంత సమీపంలో గలగల పరుగులు తీస్తున్న ప్రాణధారను వదిలేస్తున్నారు. పెన్నమ్మ ఒడిలో ఆనకట్టలను నిర్మిస్తే నిల్వ చేయొచ్చు. మెట్ట ప్రాంతాలకు తరలించి తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపొచ్చు.

waste-penna-waters-in-kadapa
కడప జిల్లాలో వృథాగా పోతున్న పెన్నా నీరు

కడప జిల్లాలో 151 కిలోమీటర్ల పొడవునా పెన్నానది ప్రవహిస్తోంది. నాలుగు దశాబ్దాల కిందట మైలవరం వద్ద నదిపై 9.965 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించారు. అనంతరం గండికోట జలాశయ నిర్మాణాన్ని 26.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టారు. బ్రిటిష్‌ కాలంలో వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె వద్ద ఆనకట్టను నిర్మించారు. ఇక్కడనుంచే కర్నూలు-కడప కాలువ ద్వారా ఆయకట్టుకు నీటిని మళ్లిస్తున్నారు. ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట దిగువన జిల్లాలో ఎలాంటి జలాశయాలు, ఆనకట్టలు నిర్మించలేదు. వచ్చిన నీరు వచ్చినట్లే పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలోకి చేరుతోంది.

తూర్పు వైపునకు 941.98 టీఎంసీలు

2009 నుంచి 2020 సెప్టెంబరు 24వ తేదీ వరకు పుష్కర కాలంలో 941.98 టీఎంసీలు జిల్లాకు దక్కకుండా తూర్పు దిశకు వెళ్లిపోయాయి. జిల్లాలో గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, హంద్రీనీవా పథకాలతోపాటు గండికోట ఎత్తిపోతల, జీకే-సీబీఆర్‌ పథకాల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. భవిష్యత్తులో నీటి అవసరాల దృష్ట్యా వీటిని మరింత విస్తరించాలని ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికను రూపొందించి ఆ దిశగా ముందడుగు వేశారు. అదే కరవు సీమ నుంచి గలగల పరవళ్లు తొక్కుతూ జారిపోతున్నా నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఒంటిమిట్ట చెరువులోకి సోమశిల వెనుక జలాలను తరలించేందుకు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇది గత నాలుగేళ్లుగా పూర్తి స్థాయిలో ఎన్నడూ కూడా ఎత్తిపోయలేదు.

● నందలూరు మండలం చింతలకుంట, ఎర్రచెరువుపల్లి, రామనపల్లి, లేబాక చెరువులకు వెనుక జలాలను తరలించి 0.593 టీఎంసీలు నిల్వ చేయాలని ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు.

● ఒంటిమిట్ట మండలం మదిలేగడ్డ దిగువన పెన్నానదిపై ఆనకట్టను నిర్మించాలని అన్నమయ్య డివిజన్‌ సాంకేతిక నిపుణులు ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.96 కోట్లు అవసరమని గుర్తించారు. ఇది పూర్తయితే 18.23 టీంఎసీలను నిల్వ చేయొచ్ఛు

● బద్వేలు నియోజకవర్గంలోని కరవు ప్రాంతాలకు సోమశిల నీటిని తరలించాలని కొన్నేళ్లుగా ప్రయత్నం జరుగుతోంది. ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు కొలిక్కి రాలేదు.

● వల్లూరు మండలం పుష్పగిరి సమీపంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో ఆనకట్ట చేపట్టాలని కర్నూలు-కడప కాలువ సాంకేతిక నిపుణులు నిర్ణయించారు. నివేదిక సమర్పణ, సర్వేకు గత నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా రూ.35.50 లక్షలిచ్చేందుకు ముందుకొచ్చారు.

● జిల్లాలో ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి ఏటా టీఎంసీల కొద్దీ నీరు జిల్లా సరిహద్దులు దాటుతున్నా నూతన పథకాలకు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.

● ఏకశిలానగరి చెరువులోకి సిద్దవటం సమీపం నుంచి పెన్నా నీటిని తరలించేందుకు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ.2 కోట్లు వెచ్చించారు. అనంతరం పనులు నిలిచిపోయాయి.

ప్రతిపాదనలు పంపించాం

జిల్లాలో పెన్నానదిపై సోమశిల వెనుక జలాలు నిల్వ ఉన్న ప్రాంతంలో ఆనకట్టను నిర్మించాలని ప్రతిపాదనలు పంపించాం. అధికారిక ఉత్తర్వులు రాగానే నీటి నిల్వకు ఆనకట్ట నిర్మిస్తాం. పినాకినిలో ప్రవహించే నీటిని తరలించేందుకు కొత్తగా ఎలాంటి పథకాలను ప్రతిపాదించలేదు. - కె.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్య సాంకేతిక నిపుణుడు, జలవనరుల శాఖ, కడప

ఇదీ చదవండి: శ్రీశైలానికి తగ్గిన వరద.. 3గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.