ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇది కూడా గంజాయి మత్తు వల్ల కాదటా.. అలా చేసినందుకే..!

By

Published : Feb 18, 2023, 12:19 PM IST

VISAKHA ACP ON YOUNG MEN ATTACK ON FAMILY: మొన్న గుంటూరు జిల్లాలో అంధ బాలిక హత్య.. నిన్న విశాఖలో కుటుంబంపై యువకుల దాడి.. ఈరెండింటికి గంజాయే కారణమని ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం కాదని తేల్చేశారు. కుటుంబంపై దాడి కేవలం బండి హర్న్​ కొట్టడం వల్లే జరిగిందని స్పష్టం చేశారు.

VISAKHA ACP ON YOUNG MEN ATTACK ON FAMILY
VISAKHA ACP ON YOUNG MEN ATTACK ON FAMILY

VISAKHA ACP ON YOUNG MEN ATTACK ON FAMILY: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇటీవల ఓ వ్యక్తి.. అంధ యువతిని హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. గంజాయి మత్తులోనే ఈ దురాగతానికి అతడు పాల్పడ్డాడనే ఆరోపణలు రాగా.. దానిని పోలీసులు అవాస్తవమని పేర్కొన్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా విశాఖలో ఓ కుటుంబంపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ దాడి విషయంలోనూ గంజాయి అనే అంశం చర్చకు దారి తీసింది. అయితే నిందితులు గంజాయి తాగి కుటుంబంపై దాడికి పాల్పడలేదని, కేవలం ద్విచక్ర వాహనం హార్న్ మోగించడం వల్లే ఘర్షణ జరిగిందని విశాఖ హార్బర్ ఏసీపీ శ్రీరాముల శిరీష పేర్కొన్నారు.

నిందితులు గంజాయి తాగినట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. విశాఖ ఒకటో పట్టణ పోలీస్​స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశాఖ హర్బర్​ ఏసీపీ శ్రీరాముల శిరీష కథనం ప్రకారం.. "ఈ నెల 15వ తేదీ బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఓ కుటుంబం జగదాంబ ప్రాంతంలో షాపింగ్ ముగించుకొని పూర్ణ మార్కెట్ మీదుగా రంగిరీజు వీధికి వెళ్తున్నారు. వెనుక నుంచి బండి మీద వచ్చిన వీర్రాజు, సంపత్ అనే ఇద్దరు యువకులు పెద్దగా హార్న్​ మోగించారు.

ఆ శబ్దానికి కుమార్తె భయపడింది. దీంతో గట్టిగా హారన్ ఎందుకు మోగించారని భార్యాభర్తలు ఓ యువకులను ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని.. ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. ఆ తర్వాత తోపులాటలు జరిగాయి. వెంటనే మహిళ తన సోదరుడికి ఫోన్​ చేసి విషయం తెలపగా అతను అక్కడికి చేరుకున్నాడు. అతనిపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ క్రమంలో మహిళ దుస్తులు చిరిగాయి. అలాగే ఆమె సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులిద్దరిని అరెస్టు చేశాం" అని ఆమె తెలిపారు.

ఆ యువకులు కూలీలని.. ఎటువంటి నేర చరిత్ర లేదని.. ఘర్షణ సమయంలో గంజాయి తాగలేదని నిర్ధారణ అయినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నారని బాధితులు చేసిన ఆరోపణలపై మీడియా వారు ప్రశ్నించగా అది పూర్తిగా అవాస్తమన్నారు. నిందితులకు పరీక్షలు నిర్వహించగా ఎటువంటి గంజాయి తీసుకోలేదని తేలిందన్నారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు.

అయితే రాష్ట్రంలో గంజాయి వినియోగం, దాడులు పెరుగుతుండడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన కొందరు కీలక నేతలు అప్రమత్తమై కప్పిపుచ్చుకునే చర్యలకు దిగారని సమాచారం. గంజాయి తీసుకోలేదని.. కేవలం బండి హారన్‌ మోగించడం వల్లే గొడవ జరిగిందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details