ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Drug Injection Gang In Visakha: విశాఖలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మత్తు మాఫియా

By

Published : May 19, 2023, 10:44 AM IST

Updated : May 19, 2023, 1:31 PM IST

Drugs Gang in Visakha: ఏ రకమైన మత్తు పదార్థమైనా విశాఖపట్నంకు భారీగా చేరుకుంటోంది. గత కొద్ది రోజుల్లో వందల కిలోల గంజాయి పట్టుకొన్న పోలీసులకు మత్తు ఇంజక్షన్ల రాకెట్ రూపంలో మరొక పరీక్ష ఎదురవుతోంది. ఏకంగా ఏడు వేల మత్తు కల్గించే ఇంజక్షన్లను టాస్క్ ఫోర్స్, సెబ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Drug Injection Gang In Visakha
విశాఖలో నిషేధిత మత్తు ఇంజక్షన్లు

విశాఖలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మత్తు మాఫియా

Drugs Gang in Visakha : ఏ రకమైన మత్తు పదార్థమైనా విశాఖపట్నంకు భారీగా చేరుకుంటోంది. కట్టడి చేసే యంత్రాంగానికి నేరగాళ్లు సవాల్ విసురుతున్నారు. పట్టుకుంటున్నది కొంతున్నా.. అవి చేరాల్సిన వారికి మరింత ఎక్కువే చేరుతున్నట్లు సమాచారం. గత కొద్ది రోజుల్లో వందల కిలోల గంజాయి పట్టుకొన్న పోలీసులకు మత్తు ఇంజక్షన్ల రాకెట్ రూపంలో మరొక పరీక్ష ఎదురవుతోంది. వీటిని వేరే రాష్ట్రాల నుంచి అధికంగా దిగుమతి చేసుకుని అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఏకంగా ఏడు వేల మత్తు కల్గించే ఇంజక్షన్లను టాస్క్ ఫోర్స్, సెబ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ప్రధానంగా అల్పాదాయ వర్గాల వారిని ఆకర్షించి, యువతను లక్ష్యంగా చేసుకుని వ్యాపారులు ఈ విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కాన్పులు, శస్త్ర చికిత్సల సమయంలో రోగికి నొప్పుల బాధలు తెలియకుండా ఈ ఇంజక్షన్లు వాడతారు. దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తులో ఉండటం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎవరికి పడితే వారికి వీటిని చేతికివ్వరు. డాక్టర్లు రాసి ఇచ్చిన చీటి ప్రకారం వీటిని విక్రయించడమే కాకుండా ఎవరైతే కొనుగోలు చేశారో వారి పేర్లను కూడా నమోదు చేసుకుంటారు. ఇలాంటి ఇంజక్షన్లను యువత మత్తుకు ఉపయోగిస్తున్నారు. నిషేదిత మత్తు కల్గించే ఇంజక్షన్లు పశ్చిమబెంగాల్ నుంచి విశాఖపట్నంకు దిగుమతి అవుతున్నాయి.

గంజాయి రవాణ నేపథ్యంలో ఏర్పడిన పరిచయాలతో కొందరు వ్యాపారులు ఖరగ్​పూర్​ నుంచి రైలు మార్గంలో విశాఖపట్నం నగరానికి ఇంజక్షన్లు తెచ్చి ఇస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్ అక్కడ 60-70 రూపాయలు ఉండగా, నగరానికి తీసుకొచ్చి స్థానిక వ్యాపారులకు 200 రూపాయలకు అమ్ముతున్నారు. వాటిని యువతకు ఒక్కోటి 300-350 రూపాయలకు విక్రయిస్తున్నారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నెల 14, 17 తేదీల్లో దాడులు చేశారు. ఈ దాడిలో 4150 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలియజేశారు.

సీతమ్మధార కనకపువీధి, మధురవాడలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు జరిపి 3,100 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసులో జి.ఉమామహేష్, బి. వెంకటేష్​ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్​కు చెందిన బిమల్ అధిక మొత్తంలో నగరానికి దిగుమతి చేస్తున్నట్లు గుర్తించామని, అతని కోసం ప్రత్యేక బృందాలను కోల్​కతాకు పంపిస్తామని చెప్పారు.

గతంలో విశాఖపట్నం నగరంలో ఓ అధికారి వీటిని ఎక్కువ మొత్తంలో ఖరగ్​పూర్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని గతంలోనే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో బిమల్ అనే వ్యక్తి వ్యాపారం మొదలుపెట్టారని, ఇతని నుంచి స్థానికంగా 10 మంది వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారని సమాచారం ఉంది. వీటిని ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.

వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతగా ఈ మత్తు ఇంజక్షన్లు తీసుకోవడం చాలా ప్రమాదకరం. దీని ప్రభావం మెదడుపై ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అదుపు తప్పితే మానసికమైన మార్పులతో పాటుగా వింతగా ప్రవర్తిస్తారు. మోతాదు పెరిగితే కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

Last Updated : May 19, 2023, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details