Gannnavaram MLA: పార్టీ మారలేదని భూమిపైకి దౌర్జన్యం!.. కోర్టు ఆదేశాలున్నా ధిక్కరింపు

author img

By

Published : May 19, 2023, 9:15 AM IST

Gannnavaram MLA Vamshi

Gannnavaram MLA Vamshi: రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా వారసత్వంగా సంక్రమించిన భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు.. గన్నవరం MLA వంశీ యత్నిస్తున్నారని టీడీపీ నేత జాస్తి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వెదురుపావులూరులోని 99 సెంట్ల భూమి వివాదంపై కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నట్లు వెంకటేశ్వరరావు వివరించారు.

Gannnavaram MLA Vamshi: అది వారసత్వంగా సంక్రమించిన డీఫారం పట్టా భూమి. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఆ భూమి విలువ దాదాపు కోటి రూపాయలు పైనే. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందిన ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని, నివేశన స్థలాలకు పంపిణీ చేయాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాలు ఇవ్వడమే కాదు.. ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఉన్న భూమిలోకి అధికారులతో వెళ్లి హల్‌చల్‌ చేశారు. ఈ సంఘటన ఎన్టీఆర్​ జిల్లా గన్నవరం మండలం వెదురు పావులూరులో గురువారం జరిగింది.

తహశీల్దారు, పోలీసులతో గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు భూమిని పరిశీలించి, వెంటనే పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఉందని, న్యాయ సలహా తీసుకోవాలని అధికారులు చెబుతున్నా.. ‘అవన్నీ మామూలే.. వెంటనే సర్వే చేసి పంపకాలు చేయండి’ అని ఆదేశించారు. వెదురు పావులూరులో జాస్తి వెంకటేశ్వరరావుకు సర్వే నంబరు 308/4లో 99 సెంట్ల డి.పట్టా పొలం ఉంది. దీనికి ఆనుకొని ఆయన స్వార్జితం పట్టా భూమి సర్వే నంబరు 305/15లో 56 సెంట్లు ఉంది. 308/4 భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఎప్పటినుంచో ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. ఇది తెలిసిన జాస్తి వెంకటేశ్వరరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. ఈ భూమికి వెంకటేశ్వరరావు తల్లి జాస్తి రాజేశ్వరమ్మ పేరుతో 1997లో డి.పట్టా జారీ చేశారు. ఆమె 2018లో చనిపోయారు. తర్వాత వారసత్వంగా వెంకటేశ్వరరావుకు సంక్రమించింది. రెవెన్యూ అధికారులు ఆయన పేరు మీదకు మార్చారు.

రాజకీయ వేధింపు..: గన్నవరంలో రాజకీయ సమీకరణాలు మారాక.. ఈ స్థలంపై ఎమ్మెల్యే కన్నుపడింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. తర్వాత వైసీపీ వైపు మొగ్గారు. గన్నవరంలో పలువురు టీడీపీ నాయకులు వంశీ వెంట వెళ్లగా, మరికొందరు టీడీపీలోనే ఉన్నారు. ఇదే క్రమంలో జాస్తి వెంకటేశ్వరరావు భూమిపై ఎమ్మెల్యే దృష్టి పడింది. గురువారం ఆ స్థలంలోకి ఎమ్మెల్యే వంశీ వెళ్లారు. ఇది ప్రభుత్వ భూమి అని.. వెంటనే దీనిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై గన్నవరం తహశీల్దారును వివరణ కోరగా.. ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వెళ్లామని తెలిపారు.

దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు: దీనిపై టీడీపీ గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వారసత్వంగా సంక్రమించిన భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ఎమ్మెల్యే వంశీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన తల్లికి ఇచ్చిన భూమి వారసత్వంగా తనకు వచ్చిందన్నారు. దీనిపై న్యాయపరంగా వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని వివరించారు. దౌర్జన్యాలకు బెదిరేది లేదని తేల్చిచెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.