ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ అటవీశాఖ భూముల్లో జీవీఎంసీ అకస్మాత్తుగా రీసర్వే..

By

Published : Nov 28, 2022, 9:02 AM IST

Updated : Nov 28, 2022, 10:35 AM IST

GVMC Re Survey in Visakha Forest Department lands: విశాఖలో అటవీశాఖకు చెందిన విలువైన భూముల్లో.. అకస్మాత్తుగా సాగిన సర్వే కలకలం రేపుతోంది. విశాఖలో ఇప్పటికే పలు భూకుంభకోణాలు చర్చనీయాంశమైన వేళ.. సరికొత్తగా తెరపైకి వచ్చిన.. ఈ సర్వే వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. కీలక అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సర్వే మాత్రం జరిగిపోయింది. 350 కోట్ల విలువైన 3.62 ఎకరాలను అటవీశాఖ కాపాడుకుంటుందా..? లేక ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న కడప ప్రాంత కీలక నేత మాట చెల్లుబాటై.. భూమి ఇతరుల పాలవుతుందా అన్నది తెలియడం లేదు.

Re Survey in Vishaka Forest Department lands
విశాఖ అటవీశాఖ భూముల్లో రీసర్వే

GVMC Re Survey in Visakha Forest Department lands: విశాఖ నడిబొడ్డున మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా, సిరిపురానికి వెళ్లే మార్గంలోని ఓ సర్వే నెంబర్‌లో.. దాదాపు 30 ఎకరాల భూమి ఉంది. ఇందులోనే ఆంధ్రా వర్సిటీకి, అటవీశాఖకు సంబంధించి భూములు ఉన్నాయి. చాలా ఏళ్లుగా ‘వన విహార్‌’ పేరుతో.. పిలుస్తున్న ఈ ప్రాంతంలోనే.. చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్ అధికారిక నివాసం ఉంది. ఇక్కడ తమకు దాదాపు 3.62 ఎకరాల భూములు ఉన్నాయని 3 వారాల క్రితం ఓ మహిళ చేసిన దరఖాస్తుతో.. జీవీఎంసీ సర్వే సిబ్బంది శనివారం మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. ఐఎఫ్​యస్ అధికారి నివాసమున్న ప్రాంతంలోనే సర్వే కూడా చేశారు. సర్వే సిబ్బంది అక్కడికి వచ్చే వరకూ అటవీశాఖ అధికారులకు కూడా సమాచారం లేదని అంటున్నారు.

ఈ ప్రక్రియ అంతా కడప ప్రాంతం నుంచి వచ్చిన ఓ నేత అనుచరుడి కనుసన్నల్లో సాగిందని సమాచారం. సర్వే పూర్తయ్యే వరకూ దరఖాస్తుదారుతోపాటు సదరు వ్యక్తి అక్కడే ఉన్నారు. తొలుత అటవీశాఖ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నుంచి.. తమ కుటుంబానికి ‘వన విహార్‌’ ప్రాంతంలో భూములు ఉన్నాయని దరఖాస్తుదారు చెబుతున్నారు. అయితే ఇన్నాళ్లు ఏయూ, అటవీ భూములని చెబుతున్నా ఎందుకు రాలేదో తెలియదు. దరఖాస్తు చేసిన కొన్ని రోజుల్లోనే జీవీఎంసీ సిబ్బంది చాలా వేగంగా స్పందించడానికి కారణాలేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ అటవీశాఖ భూముల్లో జీవీఎంసీ రీసర్వే

దరఖాస్తు వచ్చినప్పుడు దస్త్రాల్లో పరిశీలించాల్సి ఉంటుంది. ఇంకా అవసరం అనుకుంటే అటవీశాఖ నుంచి నివేదిక తెప్పించుకోవాలి. అలా చేయకుండా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేయడం వెనుక.. కడపకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉందనే మాట వినిపిస్తోంది. అందుకే అటవీశాఖ అధికారులు శనివారం స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే కోసం సిబ్బందిని పంపాలని రెవెన్యూ అధికారులు అడిగితే పంపామని.. ఎందుకని మాత్రం అడగలేదని జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు చెబుతున్నారు. అయితే.. సర్వే సిబ్బందిని పంపాలని జీవీఎంసీని తాము కోరలేదని ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ చెప్పడం గమనార్హం.

వన విహార్‌లో ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన స్థలం ఉందన్న అభ్యర్థన ఆదివారమే తమ దృష్టికి వచ్చిందని.. శనివారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినందున అక్కడేం జరిగిందో తెలియలేదని విశాఖ జిల్లా అటవీ అధికారి అనంతశంకర్ తెలిపారు. తమ దృష్టికి వచ్చాక ఆ స్థలం వివరాలు పరిశీలిస్తే.. ముందు నుంచి అటవీశాఖ పరిధిలోనే ఉన్నట్లు తేలిందన్నారు. జీవీఎంసీకి చెందిన దస్త్రాల్లోనూ అలాగే ఉందని.. తమ దగ్గరున్న ఆధారాలను జీవీఎంసీ కమిషనర్‌కు సోమవారం పంపుతామని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని అనంతశంకర్‌ అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 28, 2022, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details