ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మెట్రో రైళ్లకు.. మోక్షం ఎప్పుడు..?

By

Published : Dec 27, 2022, 6:58 AM IST

Updated : Dec 27, 2022, 10:26 AM IST

metro rail project: మెట్రో రైళ్లకు.. రాష్ట్రంలో ఎర్రజెండా పడింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా.. కనీసం ఊసే ఎత్తడం లేదు. విభజన చట్టంలో మెట్రో గురించి ఉన్నా సాధించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కనీసం కేంద్రానికి ప్రతిపాదనలూ పంపని పరిస్థితి. ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం ఇటీవల పార్లమెంట్‌ వేదికగా తెలిపింది. అయినప్పటికీ ఎలాంటి చలనం లేదు. ఇప్పటివరకూ ఒకటి రెండు సమీక్షలతోనే సీఎం జగన్‌ సరిపెట్టేశారు.

metro rail project
మెట్రో రైలు ప్రాజెక్టు


metro rail project in AP: మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, సమగ్ర రవాణా ప్రణాళిక, వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్‌ వంటివి సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని.. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హరీదీప్‌సింగ్‌ పురి రాజ్యసభలో తెలిపారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు.. కొత్త మెట్రో రైల్‌ పాలసీ-2017 ప్రకారం సవరించిన ప్రతిపాదనలు పంపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 2017 సెప్టెంబరు 1న కోరామన్న ఆయన.. ఇంత వరకూ ఎలాంటి ప్రతిపాదనా రాలేదన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి ఈ నెల 12న ఇచ్చిన సమాధానమిది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో రైలు ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

మెట్రో రైళ్లకు.. మోక్షం ఎప్పుడు..?

దేశంలోని చాలా నగరాల్లో మెట్రో రైలు, బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్, లైట్‌ రైల్‌ వంటి రవాణా వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని.. కేంద్రం మెట్రో రైల్‌ పాలసీ-2017లో స్పష్టం చేసింది. మెట్రో రైల్‌ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని.. చాలా నగరాలు రోజువారీ రవాణా అవసరాల్ని తీర్చడంలో మెట్రోరైళ్ల అవసరాన్ని గుర్తించాయని తెలిపింది. చాలా మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని పాలసీలో పేర్కొంది. కొన్ని ప్రాజెక్టుల్ని ఆయా రాష్ట్రాలే స్వయంగా లేదా ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్నాయని కేంద్రం వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వమే కాదు.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు మెట్రో రైళ్ల అవసరాన్ని గుర్తించాయి. జమ్ము, శ్రీనగర్, థానే, నాసిక్‌ వంటి ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ మెట్రో రైళ్ల ప్రతిపాదనలు కేంద్ర పరిశీలనలో ఉన్నాయి. గోరఖ్‌పూర్, దెహ్రాదూన్‌ వంటి చిన్న నగరాలూ పోటీ పడుతున్నాయి. ఆర్థిక సాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. మన రాష్ట్రం మాత్రం మణిపూర్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలతో పోటీపడుతోంది. ఎందుకంటే దేశం మొత్తంమీద ఇప్పటి వరకు మెట్రో రైళ్లు లేని, వాటి కోసం ప్రతిపాదనలే పంపని రాష్ట్రాల్లో ఏపీతో పాటు ఈశాన్య రాష్ట్రాలు,జార్ఖండ్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలే ఉన్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు.

రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగా విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి, ఆ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు ఎందుకివ్వరని అడిగిందే లేదు. విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ఏర్పాటుపై గత ప్రభుత్వ హయాంలో విస్తృత కసరత్తు జరిగి.. కేంద్రానికి ప్రతిపాదనలూ వెళ్లాయి. కేంద్ర సూచన మేరకు విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టాలని నిర్ణయించింది. 42.54 కిలోమీటర్లల పొడవున ప్రాజెక్టు చేపట్టేందుకు 2017 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరింది. 2017 మెట్రో రైల్‌ పాలసీ ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు పంపాలని కేంద్రం సూచించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక.. వాటిని మూలనపడేసింది. విజయవాడ, విశాఖల అభివృద్ధి గురించి మాటలు చెప్పే సీఎం జగన్‌.. ఆచరణలో చేసిందేమీ లేదనడానికి మెట్రో రైలు ప్రాజెక్టే ప్రత్యక్ష నిదర్శనం.

‘మనకు మెట్రో రైలు అవసరమా?...అని ప్రశ్న వేస్తే... అవును చాలా చాలా అవసరం. విజయవాడ, విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు మెట్రో రైల్‌ వంటి సమర్థమైన, అత్యున్నత ప్రమాణాలున్న ‘మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం’ వంటి రవాణా వ్యవస్థ ఎంతో అనుకూలమని ... వేగవంతమైన, సౌకర్యవంతమైన పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ లేని లోటును మెట్రో రైల్‌ భర్తీ చేస్తుందని.. ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మెట్రో రైల్‌ ఉపయోగాలేంటో ఏకరవు పెట్టారు. అన్ని ఉపయోగాలున్నాయని తెలిసినప్పుడు.. ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది? మెట్రో రైళ్ల ప్రతిపాదనల్ని కేంద్రానికి ఎందుకు పంపలేదు? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.

విజయవాడ అభివృద్ధి వైసీపీ అధికారంలోకి వచ్చాకే జరిగిందంటూ జగన్‌ సెప్టెంబరులో శాసనసభలో అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. వైసీపీ వచ్చేసరికే 80 శాతం పైగా పనులు పూర్తయిన కనకదుర్గ ఫ్లైఓవర్, నిర్మాణం మొదలైన బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను తమ ఖాతాలో వేసేసుకున్నారు. మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కృష్ణలంక వంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ముంపునకు గురవకుండా రక్షణ గోడ నిర్మాణ పనుల్ని కొనసాగించడం తప్ప విజయవాడ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.

శివారు ప్రాంతాల్ని విలీనం చేసి విజయవాడను మహానగరంగా అభివృద్ధి చేయాల్సింది పోయి.. నగరంలో భాగంగా ఉన్న తాడిగడపను ప్రత్యేక మున్సిపాలిటీగా చేసి ‘వైఎస్సార్‌ తాడిగడప’ అని పేరు పెట్టారు. మున్సిపాలిటీ అభివృద్ధికీ చేసిందేమీ లేదు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఎంత అవసరమైన ప్రాజెక్టయినా సరే.. గత ప్రభుత్వం మొదలుపెట్టిందైతే దాన్ని ఆపేయడం, మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతీయడమే ఎజెండాగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలో మెట్రో రైళ్ల ప్రతిపాదనల్నీ చేర్చింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.

అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు కలసి భవిష్యత్తులో మహా నగరంగా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించింది. విశాఖను రాష్ట్రానికి ఐటీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలనుకుంది. దానికి తగ్గట్టుగా విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టుల్ని తలపెట్టింది. ఆయా నగరాల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన మార్గాలతో పాటు, శివారు ప్రాంతాల్నీ అనుసంధానించేలా మెట్రోరైలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబరు 3న ముఖ్యమంత్రి జగన్‌ మెట్రో రైళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పట్లో అమరావతికి మెట్రో రైల్‌ అవసరం లేదని.. విజయవాడలో మిగతా రెండు కారిడార్ల నిర్మాణం చేపడితే చాలని తేల్చేశారు.

విజయవాడ- రాజధాని నగరం- గుంటూరు- తెనాలి మీదుగా విజయవాడకు 108 కిలోమీటర్ల మేర సెమీ హైస్పీడ్‌ సబర్బన్‌ సర్క్యులర్‌ రైల్‌ ప్రాజెక్టు చేపట్టాలని.... మరో కొత్త ప్రతిపాదన తెచ్చారు. తర్వాత వాటి ఊసే లేదు. మెట్రో రైలు లేదు. సర్క్యులర్‌ రైలూ రాలేదు. మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు తోడు 60.20 కిలోమీటర్ల పొడవునా నాలుగు కారిడార్లుగా మోడర్న్‌ ట్రామ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏదీ ముందుకు కదల్లేదు.అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ పేరును వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌గా మార్చేసింది. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించింది. విశాఖలో మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం దాన్నే పూర్తిస్థాయి కార్యాలయంగా మార్చేసి, విజయవాడ కార్యాలయాన్ని నామమాత్రంగా ఉంచింది. కార్పొరేషన్‌ ఎండీ విశాఖ కార్యాలయంలోనే ఉంటున్నారు.

చాలా రాష్ట్రాలు చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ, విశాఖలకు మెట్రోరైళ్ల అవసరం ఎంతో ఉన్నా ఇప్పటి వరకు ప్రతిపాదనలే వెళ్లలేదు. విజయవాడ అంటే కేవలం నగరపాలక సంస్థ పరిధిలోనిది మాత్రమే కాదు. గొల్లపూడి, పెనమలూరు, గన్నవరం వరకు నగరంలో అంతర్భాగమే. ఆ ప్రాంతాలన్నిటినీ కలిపి గ్రేటర్‌ విజయవాడ కార్పొరేషన్‌గా చేయాల్సిన ప్రభుత్వం.. దానికి భిన్నంగా నగరంలో భాగంగా ఉన్న ప్రాంతాల్ని ప్రత్యేక మున్సిపాలిటీలుగా చేస్తోంది. విజయవాడ నగరంలో భాగంగా ఉన్న గొల్లపూడి పంచాయతీని రెండుగా విభజించింది. నగరంలో భాగంగా ఉన్న యనమలకుదురు, రామవరప్పాడు వంటి ప్రాంతాలు ఇప్పటికీ పంచాయతీలే.

ప్రస్తుతం విజయవాడ నగరంలో భాగంగా, చుట్టూ పంచాయతీలే ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు సాంకేతికంగా గుంటూరు జిల్లాలో ఉన్నా.. అక్కడి ప్రజలు దైనందిన అవసరాలకు విజయవాడకే వస్తారు. ఈ ప్రాంతాలన్నీ కలిపి చూస్తే విజయవాడ జనాభా దాదాపు 25 లక్షలు ఉంటుంది. విశాఖ నగరం కూడా అనకాపల్లి, పెందుర్తి, తగరపువలస వంటి ప్రాంతాల వరకు విస్తరించింది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే... క్రమంగా అక్కడి వరకు నగరం విస్తరిస్తుంది. విశాఖ నగరం, దాని శివారు ప్రాంత జనాభా ప్రస్తుతం 30 లక్షలకుపైనే ఉంటుందని అంచనా.

ఏ భారీ నిర్మాణ ప్రాజెక్టు తీసుకున్నా.. వాటిలో వినియోగించే సిమెంట్, ఉక్కు, కంకర వంటి సామగ్రిపైనా, ఆ ప్రాజెక్టులో పనిచేసే సిబ్బంది వారి వేతనాల్ని వివిధ అవసరాల కోసం ఖర్చు చేసే క్రమంలో చెల్లించే పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తక్షణం ఆదాయం సమకూరుతుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో సుమారు 38-40 శాతం వరకు ఇలా పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళుతుందని అంచనా. విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం 20 వేల కోట్లు వెచ్చిస్తుందనుకుంటే.. దానిలో సుమారు 8 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి పన్నుల రూపంలోనే తిరిగి వస్తుంది. ఆ ప్రాజెక్టుల వల్ల కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అంత భారీ ప్రాజెక్టులొస్తే.. వలసలు ఆగుతాయి. నగర శివారు ప్రాంతాలకు చౌక ధరలో రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తే.. ఆ ప్రాంతాలూ వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇన్ని రకాల ప్రయోజనాలున్నా మెట్రో ప్రాజెక్టులపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణం.

ఇవీ చదవండి:

Last Updated :Dec 27, 2022, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details