ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హాస్పిటల్ పూర్తయ్యి.. ఉద్దానం కిడ్నీ బాధితుల తలరాత మారేది ఎప్పుడో..?

By

Published : Mar 26, 2023, 10:17 AM IST

Hospital for Kidney Patients: ప్రభుత్వాలు మారుతున్నా.. ఉద్దానం కిడ్నీ బాధితుల తలరాత మారడంలేదు. పలాసలో సీఎం జగన్‌ శంకుస్థాపన చేసిన 200 పడకల ఆస్పత్రి నిర్మాణం నాలుగేళ్లవుతున్నా పూర్తికాలేదు. నేతల హామీలు వినీ వినీ రోగులకు ఆయాసం రావడమేగానీ.. ఆస్పత్రి అందుబాటులోకి రావడం లేదు. మార్చికల్లా పూర్తిచేస్తామని ఇటీవలే వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రకటించినా.. ఏ మార్చికో తెలియని పరిస్థితి నెలకొంది. పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Kidney patients
ఉద్దానం కిడ్నీ బాధితులు

హాస్పిటల్ పూర్తయ్యి.. ఉద్దానం కిడ్నీ బాధితుల తలరాత మారేది ఎప్పుడో..?

Super Specialty Hospital for Kidney Patients at Palasa: శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు.. ఈ ఏడు మండలాలను ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతం కొబ్బరి, జీడి, మామిడి, పనస, మునగ తోటలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కానీ అక్కడ వాతావరణం ఉన్నంత ప్రశాంతంగా మనుషులు లేరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు వేలల్లో ఉన్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గంలో సుమారు 10 వేలకు పైగా.. కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు అంచనా.

ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతున్నా.. నివారణ చర్యల్లో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. బాధితులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. 2019 సెప్టెంబర్ 6 న కిడ్నీ రోగుల కోసం 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు పరిశోధన కేంద్రానికి పలాస వద్ద శంకుస్థాపన చేశారు.

దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా.. అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. 50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు.. ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. 3 నెలల కిందట కిడ్నీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి విడదల రజిని.. 2023 మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ మాటలూ నీటిమీద మూటలుగానే మిగిలిపోయాయి.

ఉద్దానం ప్రాంతంలో దాదాపు వెయ్యికి పైగా.. డయాలసిస్ కిడ్నీ రోగులు ఉన్నట్టు అంచనా. వీరు వారానికి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. దీనికోసం కుటుంబ సభ్యులతో ప్రత్యేక వాహనంతో శ్రీకాకుళం, పలాస, హరిపురం, టెక్కలి, పాలకొండ , కవిటి ప్రాంతాల్లో ఉన్న డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి రావాలి. వాహనాలు, మందుల ఖర్చులకు.. నెలకు వేలల్లోనే ఖర్చు అవుతుంది.

ప్రభుత్వం త్వరగా ఆస్పత్రి అందుబాటులోకి తెస్తే దూరాభారం తగ్గుతుందని కిడ్నీరోగులు కోరుతున్నారు. మంత్రి అప్పలరాజు స్థానికంగానే ఉంటున్నా ఆస్పత్రి నిర్మాణంపై శ్రద్ధలేదని.. స్థానిక నేతలు మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తిచేసి..ఊరట కల్పించాలని రోగులు కోరుతున్నారు.

"మాకు నాలుగు సంవత్సరాలుగా డయాలసిస్ చికిత్స అవుతుంది. కొత్త సెంటర్ నిర్మిస్తే మా లాంటి వాళ్లకి ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి వేగంగా నిర్మిస్తే మంచిది. అదే విధంగా మాకు పెన్షన్ కూడా సరిపోవడం లేదు. మందులకు, వెళ్లి వచ్చేసరిక సరిపోవడం లేదు". - డయాలసిస్ బాధితుడు

"ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక మినిస్టర్.. ఎన్నికల హామీలో కిడ్నీ బాధితుల కోసం ఎంతో చేస్తానని చెప్పారు. కానీ ప్రస్తుతం.. ఈ ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా త్వరితగతిన హాస్పిటల్ పనులు పూర్తి చేసి.. ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం". - చాపర వేణుగోపాల్, సీపీఐ నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details