ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విడుదల కాని నిధులు.. విద్యాబోధనకు తొలగని ఆటంకాలు!

By

Published : Sep 30, 2020, 6:46 PM IST

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం.. నీరు కారేట్లు కనిపిస్తోంది. అధికారులు చెబుతున్న విధంగా పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అయితే అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా పనులు పూర్తి కావాల్సిందేనని అధికారులు ఆదేశాలు జారీ చేయడం వల్ల.. ప్రధాన ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంటోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అధికశాతం ఇదే పరిస్థితి నెలకొంది.

nadu-nedu
nadu-nedu

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3,868 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 1,248 పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా విద్యశాఖ పనులు మొదలు పెట్టింది. వీటికి రూ. 300 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి.. ఇప్పటివరకు 107 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసింది. నిధుల కొరతతో పాఠశాలల్లోని అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే 8, 9, 10 తరగతి విద్యార్ధులకు పాఠశాలలు తెరవడం వల్ల.. ఉపాధ్యాయులతో పాటు విద్యార్ధులు నానాపాట్లు పడుతున్నారు.

పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రధానోపాధ్యాయులే దగ్గరుండి చేయించారు. సామగ్రి కూడా కొనుగోలు చేసి నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు రాగానే చెల్లింపులు చేస్తారనే ఉద్దేశంతో.. తెలిసిన దుకాణాల నుంచి సామగ్రిని తీసుకొచ్చి పనులు చేయిస్తూ వచ్చారు. ఇప్పుడు వాటికి నగదు చెల్లించలేక.. నిర్మాణ కార్మికులకు రోజు వారీ వేతనాలు ఇవ్వలేక అప్పుల్లో కూరుకుపోయారు. దుకాణ యజమానులు సొమ్ము చెల్లించాలని అడుగుతుండగా.. ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. పనులు చేయలేమని కార్మికులు చేతులెత్తేస్తున్న పరిస్థితుల్లో.. చేసేది లేక ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు.

పనులకు సంబంధించిన రివాల్వింగ్ ఫండ్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు లేఖ రాశామని జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ చెబుతున్నారు. అయితే పాఠశాలకు సరఫరా చేసిన సరకు యజమానులు నిరంతరం ప్రధానోపాధ్యాయులుపై ఒత్తిడి చేస్తుండడం వారికి సమస్యగా మారింది. త్వరలోనే పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరిస్తే.. వచ్చిన విద్యార్ధులను ఎక్కడ కూర్చోబెట్టి పాఠాలు చేప్పాలో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఇవీ చూడండి:

'అపోహలు వద్దు... రైతులకు అందించే విద్యుత్​ ఉచితమే'

ABOUT THE AUTHOR

...view details