ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి సీఎం జగన్.. భద్రతా ఏర్పాట్లు పూర్తి

By

Published : Nov 8, 2021, 9:38 PM IST

ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్.. రేపు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. అనంతరం ఒడిశా బయలుదేరి వెళ్లనున్నారు.

cm jagan
cm jagan


శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ వేడుక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖకు విమాన మార్గంలో చేరుకుంటారు. ఆ తరువాత అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ ద్వారా పాతపట్నం చేరుకుంటారు. వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వధూవరులను ఆశీర్వదించి.. ఆ తరువాత గంట వ్యవధిలోనే తిరిగి విశాఖకు చేరుకుంటారు. అనంతరం విశాఖ నుంచి ఒడిశా ముఖ్యమంత్రిని కలిసేందుకు భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో పాతపట్నంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.

ఒడిశాతో నెలకొన్న వివాదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపటంపై విజయనగరం జిల్లాపరిషత్తు ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సాలూరు, పార్వతీపురం ఎమ్మెల్యేలు రాజన్నదొర, అలజంగి జోగారావులు హర్షం వ్యక్తం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో చర్చల ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలకు తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చల ద్వారా విజయనగరం జిల్లాకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. జిల్లాలోని జంఝావతి ప్రాజెక్టు ఏళ్లతరబడి అసంపూర్తిగా నిలిచిపోయిందని.. ప్రాజెక్ట్ పనులు నిలిచిపోవడంతో వేలాది మంది రైతులకు సాగునీరు అందని పరిస్థితి అదేవిధంగా కొఠియా గ్రామాల సమస్య కారణంగా దశాబ్దాలుగా 23 గ్రామాల గిరిజనులు పలు సమాస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలకు ముందుకు రావటం అభినందనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details