ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Man died in YCP Attack: రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు.. గొడవ వద్దన్న వ్యక్తిపై కర్రలతో దాడి, మృతి

By

Published : Jun 20, 2023, 4:06 PM IST

YCP Mob Attacked and Killed TDP Worker: ఓ టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూక దాడిచేసి హత్య చేసిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. మరోవైపు కడప జిల్లాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat

YCP Mob Attacked and Killed TDP Worker: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎర్ర రామయ్యను వైసీపీ వర్గీయులు మూక దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. స్థానిక వైసీపీ నేత చౌక ధాన్యపు డీలర్ చిన్న కాశప్ప.. ప్రవీణ్ అనే యువకుడికి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ప్రవీణ్ మామ ఎర్ర రామయ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో కాశప్ప, అతని వర్గీయులు రామయ్యపై కర్రలు, ఇనుపరాడ్​లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామయ్య అనంతపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బత్తలపల్లిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..మరోవైపు.. కడప జిల్లాలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనంలో వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి వస్తారో రారో అనే భయం నెలకొంది. ఈ నెలలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో పదిమంది మృత్యువాత పడ్డారు. ఇందులో ఏడుగురు యువకులే ఉండడం బాధాకరం. తాజాగా ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు. ఎక్కడికి తిరిగినా కలిసే తిరుగుతారు. చివరికి మృత్యుఒడిలోకి కూడా కలిసే వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో యువకులు మరణించటంతో​ ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

కడప శివారులోని పాలెంపల్లెకు చెందిన వెంకట్, సాయి పేటకు చెందిన విజయ్ ఇద్దరు స్నేహితులు. విజయ్ డిగ్రీ చదువుతుండగా.. వెంకట్ ఇంటర్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్లి సినిమా చూసి ఇంటికి వస్తుండగా అలంకన్పల్లి సమీపంలోని కూడలి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీరిని ఢీకొనడంతో వెంకట్​ అక్కడికక్కడే మృతి చెందగా.. విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విజయ్​ను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. యుక్త వయసులో ఉన్న ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోల్డ్ షాప్​లో 80 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు చోరీ..కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బంగారు దుకాణంలో 80 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు చోరీకి గురైంది. షాప్ యజమాని బంగారు ఆభరణాలు, నగదు ఉన్న సంచిని దుకాణంలో ఉంచి బయటకు వెళ్లాడు. దుకాణంలో గుమస్తా చీపురుతో శుభ్రం చేస్తుండగా.. ఓ యువకుడు అక్కడికి వచ్చి తన చెప్పు దూరంగా పడిందని చెప్పి.. అక్కడే మాటేశాడు. చెప్పు తెచ్చుకునేందుకు గుమస్తా బయటకు వెళ్లగా.. అదును చూసి దుకాణంలోని బంగారు ఆభరణాలు, నగదు ఉంచిన సంచితో ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్​ను పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details