ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కదిరిలో స్థల వివాదం, తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ

By

Published : Aug 24, 2022, 4:15 PM IST

Updated : Aug 25, 2022, 9:13 AM IST

FIGHT BETWEEN YSRCP AND TDP రాష్ట్రంలో వైకాపా వర్గీయుల దాడులు హద్దు మీరుతున్నాయి. ఎదురించిన వారిపై దాడి చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కదిరిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోర్టు పరిధిలోని ఉన్న స్థలంలో నిర్మాణానికి వైకాపా వర్గీయులు సిద్ధమవగా.. అడ్డుకునేందుకు తెలుగుదేశం వర్గీయులు ప్రయత్నించడంతో వైకాపా వర్గీయులు మరింత రెచ్చిపోయారు.

CONFLICT BETWEEN YSRCP AND TDP
CONFLICT BETWEEN YSRCP AND TDP

CONFLICT BETWEEN YSRCP AND TDP ఓ ప్రైవేట్‌ స్థలవివాదం అధికార, విపక్ష పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. అడ్డొస్తే పొక్లెయిన్‌తో తొక్కించేయండంటూ తెదేపా వర్గీయులపై వైకాపా నాయకులు విరుచుకుపడటం చర్చనీయాంశమైంది. ఈ సంఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. భూ యజమానులు, కొనుగోలుదారులు తెలిపిన ప్రకారం.. సైదాపురం సమీపంలోని పొలంలోని సర్వే నంబరు 41లో ఆరు ఎకరాల భూమిని యజమానులు 2016లో ఇతరులకు విక్రయించారు. కొనుగోలుదారులు ప్లాట్లు వేసి అమ్మేశారు. ఈ భూమి తమ తాతల ఆస్తి అయినందున తనకూ వాటా ఉందంటూ యర్రగుంటపల్లికి చెందిన సోమశేఖర్‌ అనే వ్యక్తి ఆర్డీవో కోర్ట్టుతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే సర్వే నంబరులో కుటాగుళ్లకు చెందిన వైకాపా కార్యకర్త గంగులప్ప 2016లో 12 సెంట్ల స్థలాన్ని కొన్నారు. ఆయన తాను కొనుక్కున్న స్థలంలో బోరు తవ్వుకొని, భవనం నిర్మించుకోవడానికి సిద్ధమయ్యారు.

కదిరిలో తెదేపా, వైకాపా బాహాబాహి

విషయం తెలుసుకున్న సోమశేఖర్‌... కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో నిర్మాణం చేపట్టొద్దన్నారు. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే, తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. గంగులప్ప సన్నిహితులు కూడా సమస్యను కందికుంటకు వివరించారు. రెవెన్యూ అధికారులను సంప్రదించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన ఇరువర్గాలకు సూచించారు. అయితే బుధవారం గంగులప్ప పొక్లెయిన్‌, టిప్పర్‌లతో స్థలం వద్దకు రాగా... తోడుగా వైకాపా కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. మరోవైపు సోమశేఖర్‌కు అనుకూలంగా కందికుంట, తన అనుచరులతో ఎన్జీవోకాలనీకి వచ్చారు.

దాంతో అప్పటి వరకు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వివాదం ఇరుపార్టీల సమస్యగా మారింది. ఎవరు అడ్డొచ్చినా తొక్కించుకుంటూ వెళ్లంటూ పొక్లెయిన్‌ డ్రైవర్‌కు వైకాపా నాయకులు సూచించారు. పొక్లెయిన్‌ వేగంగా రావడంతో తెదేపా వర్గీయులు దానికి అడ్డుగా నిలిచారు. అదే సమయంలో రెండువర్గాలు పరస్పరం రాళ్లురువ్వుకున్నాయి. పొక్లెయిన్‌ అద్దాలు దెబ్బతినడంతోపాటు ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి.

రండి తేల్చుకుందామంటూ సీఐ సవాల్‌
విషయం తెలుసుకుని ఎస్సై, అర్బన్‌ సీఐలు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. తమను మాత్రమే లక్ష్యంగా చేసుకుని లాఠీఛార్జి చేశారంటూ తెదేపా వర్గీయులు పోలీసులను ఆరోపించారు. లాఠీఛార్జీని అడ్డుకోవడానికి వెళ్లిన కందికుంట చేతికీ గాయమైంది. ఈ క్రమంలో తెదేపా నేతలు ఆరోపణలు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అర్బన్‌ సీఐ మధు.. రండి తేల్చుకుందామంటూ మీసం మెలేయడం గమనార్హం. ఉద్రిక్తత పెరుగుతుండటంతో అదనపు బలగాలు చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపివేశాయి. ఈ విషయమై సీఐ మధును వివరణ కోరగా.. పొక్లెయిన్‌పై పెట్రోలు పోసి కాల్చేస్తారనే పక్కా సమాచారం ఉండటంతోనే ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జీ చేశామన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 25, 2022, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details