ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Constable Pawan No More: పాముకాటుకు గురైన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి

By

Published : May 24, 2023, 10:28 PM IST

Constable Pawan

Constable Pawan died: తుళ్లూరు మండలం అనంతవరంలో ఆర్‌-5 జోన్‌లో బందోబస్తుకు వచ్చి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్​ మృతి చెందాడు. మంగళవారం పాము కాటు వేయడంతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఆరోగ్యం విషమించడంతో పవన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పవన్ మృతి పట్ల అతని కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

police constable died of poison snake bites: రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం అనంతవరంలో మంగళవారం తెల్లవారుజామున పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్​ మృతి చెందాడు. నిన్న పాము కాటు వేసిన వెంటనే పవన్ కుమార్​ను గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రమేష్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటకీ పవన్ ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కొల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న పవన్ ఆర్‌-5 జోన్‌లో బందోబస్తుకు వచ్చాడు.

గుడిలో నిద్రిస్తుండగా పాము కాటు: ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ పవన్ కుమార్​ రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాల లే ఔట్ అభివృద్ధి పనుల బందోబస్తుకు వచ్చారు. డ్యూటీ అయిన తరువాత కానిస్టేబుల్ పవన్ తన తోటి ఉద్యోగులతో రాత్రికి అక్కడే ఉన్న గుడిలో నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో కట్లపాము కానిస్టేబుల్ పవన్ కుడి భుజంపై పాము కాటు వేసింది. పాము కాటుకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పవన్ ఆ పామును చేతితో పట్టుకొని లాగారు. ఈ నేపథ్యంలో ఆ పాము మరో మారు ఎడమ చేతిపై కాటు వేసింది. వెంటనే ఆ పామును తోటి కానిస్టేబుళ్లు చంపివేశారు. మెుదట పవన్ కుమార్​ను గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. గుంటూరు జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ ఆసుపత్రికి వచ్చారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పవన్ కుమార్​కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. మెరుగైన చికిత్స కోసం రమేష్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ పవన్ ఈ రోజు మృతి చెందాడు.

సరైన బస లేకపోవటంతో గుడిలో నిద్ర: పాము కాటు విషయం తెలుసుకున్న పవన్ కుటుంబ సభ్యులు దర్శి నుంచి గుంటూరు వచ్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవన్ కుమార్ ఇవాళ మరణించడం ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులకు సరైన సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడా వారికి సరైన బస లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నట్లు భద్రత కోసం వచ్చిన పోలీసులు వెల్లడించారు. పవన్ మృతి పట్ల అతని కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కానిస్టేబుల్ మృతి పట్ల చంద్రబాబుదిగ్భ్రాంతి: కానిస్టేబుల్ పవన్ కుమార్​ మృతి పట్ల తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పవన్ కుమార్​ కుటుంబసభ్యులకు చంద్రబాబు సానుభూతి ప్రకటించారు. పాము కాటు ఘటనలో మృతి చెందిన కానిస్టేబుల్‌ పవన్ కుమార్​ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details