ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh Yuvagalam Padayatra: "సైకో సర్కార్​ వికృత చేష్టలు.. బీసీలపైకి బుల్డోజర్లు".. లోకేశ్​ ఆగ్రహం

By

Published : Jul 18, 2023, 11:20 AM IST

Lokesh Fires on CM Jagan: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. కొండపి నియోజకవర్గంలోని మాలె పాడు నుంచి చెరుకంపాడు వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. మాలెపాడు లో పాడి రైతుల తో ముఖాముఖీ నిర్వహించిన లోకేశ్‌....ఒంగోలు డెయిరీని సైతం అమూల్‌కు అప్పగించి రైతులకు జగన్ అన్యాయం చేయనున్నారని లోకేశ్ మండిపడ్డారు.

Lokesh Fires on CM Jagan
Lokesh Fires on CM Jagan

Lokesh Fires on CM Jagan: బీసీలపైకి బుల్డోజర్లు పంపించిన జగన్‌కు.. రానున్న ఎన్నికల్లో ఆ సామాజిక వర్గాలే గోరీ కడతాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. యువగళం పాదయాత్ర 157వ రోజైన సోమవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని మాలెపాడు నుంచి ప్రారంభమైంది. చెరుకూరివారిపాలెం వరకు 12.5 కిలో మీటర్ల మేర సాగింది. దారి పొడవునా పలు గ్రామాల ప్రజలు వినతి పత్రాలు ఇచ్చి సమస్యలను లోకేశ్​కు వివరించారు. పరిష్కరించేలా చూడాలని మొరపెట్టుకున్నారు. సమస్యలను సావధానంగా విన్న లోకేశ్‌.. ఆయా సమస్యలపై స్పందించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు పరిశ్రమలు తెచ్చి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

అలాగే కొండపి నియోజకవర్గంలోని తిమ్మపాలెంలో బీసీ సోదరుడు మోరబోయిన మాల్యాద్రి ఇరవై ఏళ్లుగా నడుపుతున్న కిరాణా దుకాణాన్ని వైఎస్సార్​సీపీ నాయకులు కూల్చి వేయించారని ఆగ్రహించారు. విధి లేని పరిస్థితుల్లో ఆయన బతుకు జీవుడా అంటూ కనిగిరికి వలస పోయారని.. రాష్ట్రంలో సైకో సర్కారు వికృత చేష్టలకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ వారి పైనే ఉక్కుపాదం మోపుతూ అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరినైతే అణిచివేయాలని చూస్తున్నారో వారే వైఎస్సార్​సీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడతారని వ్యాఖ్యానించారు.

భూముల్లోకి వెళ్లనీయడం లేదు: సాగు చేసుకుంటున్న భూముల్లోకి వెళ్లనీయకుండా వైఎస్సార్​సీపీ నేతలు అడ్డుకుంటున్నారని తిమ్మపాలెం గ్రామస్థులు లోకేశ్​కు వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన లోకేశ్​.. రైతులను ఇబ్బంది పెట్టడం జగన్‌ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, సాగు చేసుకుంటున్న భూముల్లోకి వెళ్లనీయకుండా చేయడం అన్యాయమన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పోరంబోకు భూముల్లో రైతులు సాగు చేసుకునే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

దోపిడీ పైనే దృష్టంతా...: తాగునీటి కోసం వర్షాలపై ఆధారపడాల్సి వస్తోందని, కలుషిత నీటి వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని జరుగుమల్లి మండల వాసులు చెరువుకొమ్ముపాలెంలో కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన లోకేశ్‌.. జగన్‌ ప్రభుత్వానికి అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

ఇసుకాసురుల ఇష్టారాజ్యం: వైఎస్సార్​సీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తూ జేబులు నింపుకొంటున్నారని.. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి పశువులు తాగేందుకు కూడా నీళ్లు ఉండటం లేదని వేంపాడు గ్రామస్థులు లోకేశ్‌కు విన్నవించారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ వైఎస్సార్​సీపీ నేతలు తమ జేబులు నింపుకొంటున్నారని దుయ్యబట్టారు. నాలుగు సంవత్సరాలలో జగన్‌ అండ్‌ కో ఇసుక తవ్వకాల ద్వారా 10 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

చెరువుకు నీరిస్తాం: సింగరామన్న చెరువు ఎండిపోయి ఆయకట్టు రైతులు వ్యవసాయం మానేసి వలస వెళుతున్నారని, మాకేరు వాగుపై చెక్‌డ్యాం నిర్మించి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీళ్లు ఇవ్వాలని మేడపాడు గ్రామస్థులు లోకేశ్​ను కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సింగరామన్న చెరువుకు నీరందించే ఏర్పాటు చేస్తామన్నారు.

తట్ట మట్టి కూడా పోయని వైసీపీ: రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని, పక్కా ఇళ్లు మంజూరు చేయలేదని అంకిరెడ్డిపాలెం వాసులు లోకేశ్​కు వినతి ఇచ్చారు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించామని, వైఎస్సార్​సీపీ తన నాలుగేళ్ల పాలనలో రోడ్లపై తట్ట మట్టి పోసిన పాపాన పోయింది లేదన్నారు.

పాస్టర్లకు ఇళ్ల స్థలాలు: తిమ్మపాలెం వాటర్‌ ట్యాంక్‌ వద్ద పొన్నలూరు మండల పాస్టర్లు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఆయన మాట్లాడుతూ.. క్రిస్టియన్‌ మైనారిటీలకు చెందిన వేల కోట్ల ఆస్తులను జగన్‌ అండ్‌ కో కబ్జా చేశారన్నారు. క్రైస్తవ శ్మశాన వాటికలను కూడా వైసీపీ దొంగలు వదిలిపెట్టడం లేదని విమర్శించారు. పాస్టర్లకు ఇళ్లస్థలాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

ఆ సామాజిక వర్గమూ నష్టపోయింది: రాష్ట్రంలో 2 లక్షల మంది ఉన్నామని, తమ సమస్యలను పరిష్కరించాలని కుంటిమల్లారెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. స్పందించిన లోకేశ్‌.. సమాజంలో అన్ని సామాజికవర్గాల ఆత్మగౌరవంతో జీవించాలన్నదే టీడీపీ లక్ష్యమని, జగన్‌ అధికారంలోకి వచ్చాక నలుగురు రెడ్లు తప్ప.. ఆ సామాజిక వర్గం కూడా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అధికారంలోకి వచ్చాక పిచ్చిగుంట్ల పేరును మార్పునకు ప్రత్యేక జీవో తెస్తామని చెప్పారు.

మాలెపాడు గ్రామస్థులు డయాలసిస్‌ సమస్యపై వినతి ఇచ్చారు. వైఎస్సార్​సీపీ పాలనలో వైద్యరంగం పూర్తిగా ఆస్వస్థతకు గురైందని, కేవలం కాల్షియం, ఐరన్‌ బిళ్లలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం నిరాకరిస్తున్న పరిస్థితులున్నాయన్నారు. కిడ్నీ బాధితులకు అవసరమైన మందులు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details